Unemployment: 55 ఏళ్ల నాగ్‌పూర్ వ్యక్తి నిరుద్యోగం కారణంగా త‌న జీవితాన్ని బ‌ల‌వంతంగా ముగించాడు. ఆ  వ్యక్తికి చాలా కాలంగా ఉపాధి లేక‌పోవడంతో డ‌బ్బు స‌మ‌స్య‌ల‌తో బాధప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు.  

Unemployment: 55 ఏళ్ల ఒక వ్యక్తి ఉద్యోగం లేదనే మనస్తాపంతో తన జీవితాన్ని ముగించుకున్నాడని నాగ్‌పూర్ పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. ఆ వ్యక్తి శుక్రవారం నాడు తాను నివాసం ఉంటున్న గౌలిపురాలోని ఇంటిలో తన జీవితాన్ని ముగించాడు. ఆత్మ‌హ‌త్య స‌మాచారం అందుకున్న పోలీసులు అతన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ తర్వాత మరణించాడని కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

అతనికి చాలా కాలంగా ఉద్యోగం లేదు. డబ్బు సమస్యలను ఎదుర్కొవ‌డానికి జ్యూస్ స్టాల్ ను న‌డుపుతున్నాడు. త‌నకున్న స‌మ‌స్య‌ల‌ను నేప‌థ్యంలో తన జ్యూస్ స్టాల్‌ను కూడా విక్రయించినట్లు అధికారి తెలిపారు. అతను తన తల్లితో క‌లిసి జీవిస్తున్నాడ‌ని పేర్కొన్నారు. కాగా, దేశంలో గ‌త కొంత కాలంగా నిరుద్యోగం పెరుగుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తావిస్తూ.. కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. విదేశాల్లో ఉన్న తన స్నేహితుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన ప్రధాని.. సొంత దేశంలోని యువతను నిరుద్యోగులుగా మార్చేశారని, ఈ యువత పట్ల ఇంత వివక్ష ఎందుకు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై మండిపడ్డ రాహుల్ గాంధీ, "నవ భారతదేశంలో హక్కుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తారు" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ బస్సులో కొంతమంది విద్యార్థులను పోలీసులు తీసుకెళ్లినట్లు చూపించే వీడియోను ట్విట్టర్‌లో పంచుకోవడం ద్వారా గాంధీ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం న‌డుచుకుంటున్న తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ప్రశ్నలు అడగొద్దు.. గొంతు ఎత్తొద్దు.. శాంతియుతంగా నిరసనలు తెలపొద్దు.. నవ భారతంలో హక్కుల కోసం అరెస్టులు చేస్తాం.. యువతను నిరుద్యోగులుగా మార్చి.. కోట్లాది కుటుంబాల ఆశలను వమ్ము చేస్తూ.. ఈ నియంతృత్వ ప్రభుత్వం దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు' అని హిందీలో ట్వీట్ చేశారు.