లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎందరో మహిళలు.. మీటూ ఉద్యమం  ద్వారా తమ బాధను తెలియజేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం సినిమా రంగంలో ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాగా... ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్న యువతులు కూడా తమకు జరిగిన అన్యాయంపై గొంతు ఎత్తి చెబుతున్నారు.

తాజాగా ఓ నిరుద్యోగ యువతి.. ఉద్యోగం సంపాదించే క్రమంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీటూ అంటూ సోషల్ మీడియాలో తెలియజేసింది. తన ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకొని, తన పేరు కూడా బయటకు చెప్పకుండా ఆమె ఈ ఆరోపణలు చేసింది. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన  ప్రభుత్వ ఉద్యోగి కృష్ణేగౌడ ఉద్వోగం ఇప్పిస్తానంటూ నమ్మించి తన మొబైల్‌ నంబర్‌ను తీసు కుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది.

 ముద్దుకు ఒక రేటు, పిలిచిన్నప్పుడు వస్తే అడిగినంత డబ్బులు ఇస్తానంటూ తనపై ఒత్తిడి చేసిన్నట్లు ఆమె వివరించింది. పత్రికలు, టీవీలో వస్తున్న మీటూ ఉద్యమం స్ఫూర్తితో తన బాధను వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపింది. కామాంధునిపై చర్యలకు జిల్లా ఎస్‌పీ ప్రకాశ్‌గౌడ సాయం కావాలని, కృష్ణేగౌడ లాంటి కీచకుడికి చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. రిటైరయ్యే వయస్సులోనున్న అతడు.. రూ.15 వేలు ఇస్తా, ఒక ముద్దు పెట్టించుకోవాలని తనను వేధించినట్టు ఆమె వెల్లడించింది.

కాగా.. ఆమె ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఆరోపణలపై విచారించి..అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.