ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో నీటిలోపల కూడా నిఘా... సరికొత్త డ్రోన్లు రెడీ
ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం యోగి సర్కార్ సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. చివరకు 100 మీటర్ లోతువరకు నీటిలో ఈ టెక్నాలజీ సాయంతో గస్తీ ఏర్పాటుచేస్తున్నారు.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా: సనాతన ధర్మంలో అతిపెద్ద కార్యక్రమంగా పేర్కొనే ప్రయాగరాజ్ మహా కుంభమేళాను మరింత వైభవంగా నిర్వహించాలన్న కృతనిశ్చయంతో యోగి ప్రభుత్వం వుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఈజీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంలో 45 కోట్ల మంది సంగమ స్నానం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే, మహా కుంభమేళాలో తొలిసారిగా యాత్రికుల భద్రత కోసం నీటి అడుగున డ్రోన్‌లను మోహరించారు. ఇవి 24 గంటలూ నీటిలో జరిగే కార్యకలాపాలపై నిఘా ఉంచుతాయి. ఈ నీటి అడుగున డ్రోన్లు చీకటిలో కూడా లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. ఇవి 100 మీటర్ల లోతు వరకు నీటిలోకి వెళ్లి, ఏ పరిస్థితుల్లోనైనా ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి.
ప్రతి యాత్రికుడి భద్రతకు వ్యూహం
పిఏసి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కలిసి యాత్రికుల భద్రత కోసం పనిచేస్తున్నాయి. ప్రతి యాత్రికుడి భద్రతకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. 700 జెండాలున్న పడవలపై పిఏసి, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికుల భద్రత కోసం రిమోట్ లైఫ్ బాయ్‌లను పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. ఇవి క్షణాల్లో ఎక్కడికైనా చేరుకోగలవు, ఏదైనా ప్రమాదం జరిగే ముందే వ్యక్తిని సురక్షిత ప్రాంతానికి తరలించగలవు.