మాంత్రికుడి మాటలు విని గుప్త నిధుల కోసం కన్న కూతురినే చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టాడో తండ్రి. ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెడితే..

ఉత్తరప్రదేశ్‌, బరబంకిలోని కుర్ద్‌ మావ్‌ గ్రామానికి చెందిన ఆలం అనే వ్యక్తి ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని ఓ మాంత్రికుడు నమ్మబలికాడు. అవి ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే 10 సంవత్సరాల ఆలం కూతురిపై కొన్ని పూజలు చేయాలని చెప్పాడు. 

మాంత్రికుడి మాటలు నమ్మిన ఆలం తన కూతుర్ని పూజలో కూర్చోబెట్టాడు. పూజలో భాగంగా చిన్నారిని తీవ్రంగా కొట్టాడు. అడ్డు వచ్చిన భార్యను కూడా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన కూతురు మృతి చెందింది. ఈ విషయం బైటికి పొక్కకూడదని ఇంట్లోనే కూతురి శవాన్ని పూడ్చిపెట్టాడు. 

మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో పూడ్చిన మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. తీవ్ర గాయాల కారణంగానే ఆలం కూతురు చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.