న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చేసింది. ఓ మహిళ పొరుగింటి పిల్లవాడిని చంపి, శవాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి దాన్ని భవనం పైకప్పు మీద పడేసింది. సంతానలేమి కారణంగా, మనిషిని బలి ఇస్తే సంతానం కలుగుతుందని చెప్పడంతో మహిళ ఆ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. 

మూడేళ్ల పిల్లవాడిని చంపిన పాతికేళ్ల వయస్సు గల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలను కనాల్సిన ఒత్తిడిలో ఆ మహిళ పడింది. అత్తింటివారు, బంధువులు పిల్లలు కలగలేదని ఆమెను ఎత్తిపొడుస్తూ వచ్చారు దీంతో ఆమె మాంత్రికుడిని సంప్రదించింది. అతని సలహా మేరకు దేవుడ్ని సంతృప్తి పరచడానికి పిల్లవాడిని బలి ఇచ్చింది. 

నీలం గుప్తా అనే నిందితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.... ఆమె 2013లో వివాహం చేసుకుంది. వైద్యులను సంప్రదించినప్పటికీ పిల్లలు కలగలేదు. నాలుగేళ్ల క్రితం ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయిలో గల తన పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో మాంత్రికుడిని సంప్రదించింది. ఓ పిల్లాడిని బలి ఇస్తే సంతానం కలుగుతుందని అతను చెప్పాడు. 

తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు శనివారంనాడు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు బాలుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 

పోలీసులు తమ గాలింపులో పక్కింటి భవనంపై ఓ సంచీని పోలీసులు కనిపెట్టారు. దాన్ని తెరిచి చూడడంతో పక్కించి పిల్లవాడి శవం కనిపించింది. శవం మెడపై గాయాలున్నాయి. బాలుడిని గొంతు నులిమి చంపినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. 

పిల్లవాడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యనేరం కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు మృతుడి చుట్టుపక్కల కుటుంబాలవారిని ప్రశ్నించారు. చివరిసారి పక్కింటిలో ఆ బాలుడిని చూసినట్లు వారు తెలిపారు 

దాంతో పోలీసులు నీలం గుప్తాను ప్రశ్నించారు. తొలుత కేసును తప్పుదోవ పట్టించడానికి ఆమె ప్రయత్నించింది. చివరకు అసలు విషయం చెప్పింది. బాలుడు ఒంటరిగా భవనం పైకప్పుపై ఆడుకుంటుండడం చూసిన నీలం గుప్తా అతని వద్దకు వెళ్లి గొంతు నులిమి చంపేసింది. ఆమె భర్త కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు.