2020 ఢిల్లీ అల్లర్ల కేసులో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ లీడర్ ఉమర్ ఖలీద్, మరో మాజీ స్టూడెంట్ లీడర్ ఖలీద్ సైఫీలను డిశ్చార్జీ చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. వీరిద్దరినీ విముక్తం చేసినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధ్రువీకరించారు. 

న్యూఢిల్లీ: 2020 ఢిల్లీ అలర్ల కేసు నుంచి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ స్టూడెంట్ లీడర్ ఉమర్ ఖలీద్‌కు విముక్తి లభించింది. ఈ కేసును ఆయనను డిశ్చార్జీ చేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఉమర్ ఖలీద్‌తోపాటు మరో స్టూడెంట్ లీడర్ ఖలీద్ సైఫీని కూడా ఈ కేసు నుంచి విముక్తం చేసింది. ఢిల్లీ చాంద్‌బాగ్‌లో రాళ్లు విసిరేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో వీరిద్దరూ బెయిల్ లభించింది. కానీ, మరో కేసులో వారు జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

ఈ ఇద్దరు విద్యార్థి నాయకులపై ఉపా చట్టం కింద అభియోగాలు మోపబడ్డాయి. వీరిద్దరు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. చాంద్‌బాగ్ కేసుకు సంబంధించి వీరిద్దరూ నేరానికి పాల్పడినట్టు చూపే కచ్చితమైన సాక్ష్యాధారాలు లేవు. ఈ కారణంగా వారిని కోర్టు కేసు నుంచి విముక్తి చేసింది. ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీలను ఈ కేసు నుంచి అదనపు సెషన్స్ న్యాయమూర్తి పులస్త్య ప్రమచాలా విముక్తి చేసినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్ పాండే ధ్రువీకరించారు.

వీరిద్దరు సహా ఇతరులపైనా కరవాల్ నగర్ పోలీసు స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాయిటింగ్, నేరపూరిత కుట్ర, ఆర్మ్స్ యాక్ట్ సహా పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లు.. జేఎన్ యూ మాజీ విద్యార్థి నేత అరెస్ట్

అక్టోబర్ నెలలో ఢిల్లీ హైకోర్టు ఉమర్ ఖలీద్‌కు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఢిల్లీ అల్లర్లలో 53 మంది మరణించగా.. సుమారు 700 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఉపా చట్టం కింద అభియోగాలు ఎదుర్కొన్న ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరిపడా కారణమేదీ అప్లికేషన్‌లో లేదని పేర్కొంది.

ఉమర్ ఖలీద్‌ను 2020 సెప్టెంబర్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉమర్ ఖలీద్ మాత్రం తాను ఏ నేరమూ చేయలేదని, అల్లర్ల కేసులోనూ నిందితులతో తనకు ఏ నేరపూరితమైన సంబంధాలూ లేవని చెప్పారు. ఆయనపై దాఖలైన అభియోగాలను ఖండించారు.