భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సంతోషపడుతున్న వేళ కొత్తగా యూకే స్ట్రెయిన్‌ కేసులు కలవరపెడుతున్నాయి. దేశంలో చాప కింద నీరులా కొత్త వైరస్ విజృంభిస్తోంది.

తాజాగా శుక్రవారం మరో ఐదుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 114కు పెరిగింది. బ్రిటన్‌లో స్ట్రెయిన్ కేసులు వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన భారత్‌.. ఆ దేశానికి విమాన సర్వీసులను నిలిపివేసింది.

అయితే ఆ తర్వాత జనవరి 8 నుంచి పాక్షికంగా సేవలు ప్రారంభించినప్పటికీ.. యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వీరిలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారి రక్తనమూనాలను పరీక్షలకు పంపుతున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 114 మందికి స్ట్రెయిన్‌ సోకగా.. ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉన్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది

మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీకా పంపిణీని ప్రారంభిస్తారని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు.