'నా కొడుకే కావచ్చు..వాడికి బతికే అర్హత లేదు': మరణశిక్ష విధించాలన్న ఉజ్జయిని అత్యాచార నిందితుడి తండ్రి
ఉజ్జయినిలో 12 ఏండ్ల చిన్నారిపై జరిగిన దారుణమైన అత్యాచారం ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకు ఇలాంటి పని చేశాడంటే.. నమ్మడం కష్టంగా ఉందనీ, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించడమే కరెక్ట్ అని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన అత్యాచారం ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై భరత్ సోని అనే ఆటో రిక్షా డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుడి తండ్రి రాజు సోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 'బాధితురాలి స్థానంలో నా బిడ్డ ఉండి ఉంటే నేనూ ఇలాగే మాట్లాడేవాడిని. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి బతికే అర్హత లేదు. అది నా బిడ్డ అయినా.. మరెవరయినా.. అలాంటి నేరానికి పాల్పడే అలాంటి వారిని ఉరితీయాలి లేదా కాల్చివేయాలి’ అని రాజు సోనీ పేర్కొన్నారు.
ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఏం జరిగిందా? అని తెలుసుకుంటున్నని, తన కొడుకుతో కూడా మాట్లాడానని రాజు సోనీ వెల్లడించారు. అయితే.. తన కుమారుడు మౌనంగా ఉండి.. ఏమీ తెలియనట్టు తన రోజువారీ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నాడనీ, ఈ దారుణంపై మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. పోలీసులు తన కొడుకుని అరెస్టు చేశారు. కాని నిజం తరువాత బయటకు వస్తుందని నిందితుడి తండ్రి రాజు సోని వ్యాఖ్యానించారు. "ఓ తండ్రి నా కొడుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డడంటే.. నేను నమ్మడం లేదు. కానీ ఒకవేళ అతను పాల్పడితే.. అతనికి కఠినమైన శిక్ష విధించబడాలి" అని రాజు సోని అన్నారు.
సంభావ్య నేరస్థులను అరికట్టడానికి ఇటువంటి భయంకరమైన కేసులలో వేగవంతమైన చర్యలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు. పోలీసులు వారిని కాల్చివేయాలని అన్నారు. “సిగ్గు నుంచి బయటపడలేకపోతున్నాం.. నేనేం చేయాలి?.. నాకేమీ అర్థం కావడం లేదు.. ఆ అమ్మాయి నా కూతురే అయివుండొచ్చు.. అతని స్థానంలో నేనైతే నా తప్పు ఒప్పుకుని శిక్ష పడేవాడిని." అని రాజు సోని అన్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు భారత్ సోనీని అరెస్టు చేసిన పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లగా.. అధికారుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భరత్ సోనీ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.