మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చోటుచేసుకున్న వేళ.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది. ఉద్దవ్ ఠాక్రే‌కు కరోనా సోకిందని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం తెలిపారు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చోటుచేసుకున్న వేళ.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది. ఉద్దవ్ ఠాక్రే‌కు కరోనా సోకిందని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. అక్కడ పార్టీ పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యతలను సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు అప్పగిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆయన ముంబై చేరుకుని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తరువాత కమల్ నాథ్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి ఉన్నారని, సమావేశంలో 40 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని తెలిపారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడగా.. వారు కూడా చేరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని.. అందరూ కలిసి ఉన్నారని తెలిపారు. 

మరోవైపు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని కూడా కలవాల్సి ఉందని.. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో కలవడం కుదరలేదని చెప్పారు. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుపై ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ఉన్నారని, శివసేన వారి ఎమ్మెల్యేలను చూస్తుందని అన్నారు. గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్దమని అన్నారు. మధ్యప్రదేశ్ మాదిరిగానే మహారాష్ట్రలోనూ రాజ్యాంగంతో ఆటలాడుకుంటున్నారని మడిపడ్డారు. మరోవైపు కమల్‌నాథ్ కాసేపట్లో ఎన్సీప్ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం కానున్నారు. 

హోం ఐసోలేషన్‌లో ఉద్దవ్ ఠాక్రే..
కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఉద్దవ్ ఠాక్రే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. రాష్ట్ర కేబినెట్ భేటీకి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటుచేసంది. దీంతో ఉద్దవ్ ఠాక్రే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పటికే శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే‌తో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి.

40కు పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న ఏక్‌నాథ్ షిండే
శివసేన తిరుగుబాటు మంత్రి ఏక్‌నాథ్ షిండే.. ఈరోజు ఉదయం సూరత్‌ నుంచి తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. అయితే ఏక్‌నాథ్ షిండే‌తో ఎంతమంతి ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్.. ఈ వార్తలకు బలం చేకూరిచ్చినట్టయింది. మహారాష్ట్రలో శాసనసభ రద్దు దిశగా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 

ఇక, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వంలో భాగమైన శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత సాధారణ మెజారిటీ మార్క్ 145.