కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సీఎంలు ఉమ్మడి పోరుబాట సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సీఎంలు ఉమ్మడి పోరుబాట సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు కేసీఆర్ కూడా మమతా బెనర్జీతో మాట్లాడినట్టుగా చెప్పారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో (uddhav thackeray) చర్చలు జరిపేందుకు ముంబై వెళ్లనున్నట్టుగా ఇటీవల ప్రెస్‌మీట్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఉద్దవ్ ఠాక్రే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. ముంబైకి రావాల్సిందిగా కేసీఆర్‌ను మహారాష్ట్ర సీఎం ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 20వ తేదీన కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. అక్కడ ఉద్దవ్ ఠాక్రేతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక, బీజేపీ వ్యతిరేక పోరాటానికి ఉద్దవ్ ఠాక్రే మద్దుతు ప్రకటించారు.
ముంబైకి రావాలని, తన ఆతిధ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం.. కేసిఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును తెలిపారు.
‘కేసిఆర్ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం..’ అని ఉద్దవ్ ఠాక్రే ఫోన్‌లో కేసీఆర్‌తో చెప్పారు. ముంబైకి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలని.. అదే సందర్భంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుదామని అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్‌కు పలువురి నుంచి మద్ధతు లభిస్తోంది. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ (hd devegowda) ..కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్‌ను దేవేగౌడ అభినందించారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన చెప్పారు. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా వుంటాం… మీ యుద్దాన్ని కొనసాగించాలని కేసీఆర్‌కు దేవేగౌడ సూచించారు. దీనికి ముఖ్యమంత్రి బదులిస్తూ.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని చెప్పారు.
