Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో మరో కూటమికి ఛాన్స్.. బీజేపీకి బ్రేకులు వేయడానికి ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్‌లు ఏకతాటిపైకి..

మహారాష్ట్రలో మరో రాజకీయ ప్రయోగానికి బీజం పడింది. బీజేపీ నియంత పాలనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రకాశ్ అంబేద్కర్ చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపాదించారు. ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత అంతా ఏకం అవుతారని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు.
 

uddhav thackeray and prakash ambedkar may join hands to tackle bjp in maharashtra
Author
First Published Nov 22, 2022, 3:03 PM IST

ముంబయి: మహారాష్ట్రలో మరో ప్రయోగానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి బ్రేకులు వేయడానికి ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్‌లు ఏకతాటిపైకి వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొని జట్టు కట్టడంపై వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో కొత్త చర్చను ముందుకు తెచ్చాయి.

ప్రబోధంకర్ వెబ్ సైట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్‌లు హాజరయ్యారు. ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలో వంచిత్ బహుజన్ అగాదీ- భీమ్ శక్తి ఉన్నది. దీనికి విదర్బ రీజియన్‌లో బలమైన ఓటుబలం ఉన్నది. ముఖ్యంగా దళిత ఓటర్ల నుంచి మద్దతు ఎక్కువ ఉన్నది. కాగా, ఉద్ధవ్ ఠాక్రేకు హిందూ ఓటర్ల బలం ఉండనే ఉన్నది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో వంచిత్ 14 శాతం ఓటు శాతాన్ని సాధించింది. ఫలితంగా కాంగ్రెస్, ఎన్సీపీలు పది స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇందులో మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా నాందేడ్ నుంచి ఓటమిపాలయ్యారు.

ఉద్ధవ్ ఠాక్రే సంఘ సంస్కర్త ప్రభోదంకర్ ఠాక్రే శివసేనను మరాఠాల కోసం స్తాపించగా.. దాన్ని ఆయన కొడుకు బాలాసాహెబ్ ఠాక్రే నడిపించారు. కాగా, దళిత నేత ప్రకాశ్ అంబేద్కర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడే కావడం గమనార్హం.

Also Read: ఉద్ధవ్ ఠాక్రే టీమ్, కాంగ్రెస్‌కు మధ్య సయోద్య! భారత్ జోడో యాత్ర విశేష స్పందన అంటూ సంజయ్ రౌత్ ట్వీట్

ఈ కార్యక్రమంలో ప్రకాశ్ అంబేద్కర్‌కు కూటమి ప్రతిపాదనలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. మన దేశం నియంతృత్వం వైపు సాగుతున్నదని, మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాడేవారితో చేతులు కలుపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం ఇప్పుడు కలవకపోతే మన తాతల వారసత్వం గురించి మాట్లాడే హక్కు మనకు ఉండదు. సమాజంలోని అసమానతను చూస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఊరికే కూర్చోలేదు. ప్రజలను ఏకం చేసి నియంత పాలకులపై పోరాడారు. మా తాత కూడా ప్రబోధంకర్ కూడా సమాజంలోని దురాచారాల గురించి రాశారు. పోరాడారు’ అని ఠాక్రే పేర్కొన్నారు.

ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలకు స్పందనగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రకటించిన తర్వాతే వాళ్లే ఒకచోటికి వస్తారని పేర్కొన్నారు. ‘ఎన్నికలు ఈ రోజు ప్రకటించినా వారంతా ఏకమవుతారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వ ఒక స్టే ఆర్డర్ పై నడుస్తున్నది. ఇది రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు దెబ్బే. సుప్రీంకోర్టు వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios