కొత్త పార్లమెంట్ భవన ప్రారంభానికి ద్రౌపది ముర్మును పిలవకపోవడం కులవివక్షే: ఉదయనిధి స్టాలిన్
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం కులవివక్షకు నిదర్శనంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.

చెన్నై: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షకు ఉదాహరణగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా సోషల్ మీడియాలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పెరియార్ హేతువాద సిద్దాంత పరంగా డీఎంకె ఏర్పాటైంది. ఉదయనిధి స్టాలిన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ మేరకు తమిళనాడు గవర్నర్ ను బీజేపీ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు.
మరో వైపు ఇదే విషయమై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తమిళనాడు గవర్నర్ కు లేఖ రాశారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం ప్రస్తుత సనాతన వివక్షకు ఉత్తమ ఉదహరణగా ఆయన పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
ఈ నెల 2వ తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులను నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని కూడ నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని తాను పదే పదే మాట్లాడుతానన్నారు. ఇది కొందరికి చిరాకు తెప్పించవచ్చన్నారు. మహాభారతంలోని ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి పట్ల వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ సామాజిక వివక్ష అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చారు.