Udaipur Murder Case: రాజస్థాన్ లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య రాష్ట్రంలో ఉద్రిక్త పరస్థితులకు దారితీయడంతో పాటు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.
Udaipur Murder Case: ఉదయ్‌పూర్ లో చోటుచేసుకున్న క్రూరమైన టైలర్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితలకు కారణమైంది. రాజస్థాన్ తో పాటు అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఉదయ్‌పూర్ హత్య రాజకీయంగా హీటును పెంచుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మరింగా ముదురుతోంది. ఈ క్రమంలోనే స్పందించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ ను దారుణంగా హత్య చేసిన ఇద్దరు నిందితులపై రాజస్థాన్ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉదయ్ పూర్ హత్య ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించినదిగా ఆయన పేర్కొన్నారు. అలాగే, నిందితులకు విదేశాల్లో పరిచయాలు ఉన్నట్లు కూడా సమాచారం అందిందని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
జామా మసీదు షాహీ ఇమామ్ స్పిందిస్తూ..
ఉదయ్‌పూర్ హత్యపై దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ స్పందించారు. ఈ చర్యను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇస్లాంకు వ్యతిరేకమని అన్నారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
రాజస్థాన్ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది..
ఉదయ్‌పూర్ లో చోటుచేసుకున్న క్రూర హత్యను తాము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజస్థాన్ సర్కారు తగిన చర్యలు తీసుకుంటున్నదని పేర్కొంటూ.. శాంతి భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. "ఉదయ్‌పూర్ హత్యను మేమంతా ఖండిస్తున్నాం. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సత్వర చర్యలు తీసుకున్నారు.. ఈ దారుణం వెలుగులోకి వచ్చిన రెండుమూడు గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ సర్కారు అప్రమత్తంగానే ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతుందని ప్రభుత్వం తీసుకున్న చర్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిరుత్సాహినికి గురిచేయడం సరికాదు" అని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఒక్క రాజస్థాన్‌లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, అసోం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిస్థితులపై ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంశాఖలు మౌనం వీడి స్పందించాలి. ఇలాంటి ఘటనపై ప్రజలను హెచ్చరించాలి. హింసకు పాల్పడవద్దని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నాయకుడు కోరారు.
