Udaipur Murder Case: రాజస్థాన్ లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసు నిందితులకు సబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు 2014లో పాకిస్థాన్ లోని కరాచీ దావద్-ఎ ఇస్లామీకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
Udaipur Murder Case: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో చోటుచేసుకున్న హత్యతో సంబంధం కలిగివున్న నిందితుల గురించి ఒక్కొక్కటిగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర పోలీసులతో పాటు ఎన్ఐఏ కూడా కేసు నమోదుచేసుకుని దీనిపై విచారణ జరుపుతోంది. ఉగ్రవాదులకు వీరికి సంబంధాలు ఉన్నాయనే అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం ఈ దారుణానికి పాల్పడిన వారికి వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యప్తు కొనసాగుతున్నదని తెలిపారు. అంతర్జాతీయంగా వీరికి ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజస్థానల్ డీజీపీ ఎమ్ఎల్ లాథర్.. ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. వీరు గతంలో పాకిస్థాన్ వెళ్లివచ్చినట్టు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో అతిక్రూరంగా ఓ దర్జీని తల నరికి చంపారు ఇద్దరు దుండగులు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు నుపూర్ శర్మకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తూ.. పోస్టులు చేసినందుకు ఈ హత్య చేసినట్టు నిందితులు పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఇస్లాంను కించపర్చినందుకు ఈ హత్య చేశామని పేర్కొంటూ.. ప్రధాని నరేంద్ర మోడీని సైతం బెదిరించారు. కేసు నమోదుచేసుకున్న రాజస్థాన్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఉదయపూర్ హత్య కేసులో ఇద్దరు నిందితులలో ఒకరు 2014లో పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న దావత్-ఎ-ఇస్లామీకి వెళ్లారని రాజస్థాన్ DGP ML లాథర్ చెప్పారు. ఉదయపూర్ హత్య నిందితుల మధ్య సంబంధాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. మరియు పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సమూహంతో సంబంధాలున్నాయని తెలిపారు. దావత్-ఎ-ఇస్లామీ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇది పాకిస్థాన్‌లో ఉన్న మతపరమైన ఉద్యమానికి సంబంధించినది. ఇస్లాం స్థాపకుడు ప్రవక్త ముహమ్మద్ ఉపదేశాలు.. సందేశాన్ని ప్రచారం చేసే లాభాపేక్షలేని సంస్థగా దావత్-ఎ-ఇస్లామీకి గుర్తింపు ఉంది. ఇది ఇస్లామిక్ అధ్యయనాలలో ఆన్‌లైన్ కోర్సులను కూడా అందిస్తోంది. అలాగే, ఒక టెలివిజన్ ఛానెల్‌ని కూడా నడుపుతోంది. దావత్-ఎ-ఇస్లామీ ఆన్‌లైన్ కోర్సుల ద్వారా దావా (ఇస్లాంకు ఆహ్వానం), మతం మార్చడానికి మరియు ప్రజలను సమూలంగా మార్చడానికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నదని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
నిందితుల్లో ఒకరికి దావత్-ఎ-ఇస్లామీకి ఉన్న లింక్ గురించి డీజీపీ లాథర్ మాట్లాడుతూ.. దావత్-ఎ-ఇస్లామీ గ్రూప్ వ్యక్తులు కాన్పూర్‌లో చురుకుగా ఉన్నారనీ, దేశ రాజధాని ఢిల్లీ, ముంబయిలలో వీరికి కార్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ హత్య కేసులో ఇద్దరు నిందితులు-మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్ లపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసినట్లు డీజీపీ లాథర్ తెలిపారు. ఈ కేసులో సీమాంతర ఉగ్రవాద సంబంధాలపై తాము లోతైన విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. నిందితులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను కూడా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. ఇదిలావుండగా, తనను ఇద్దరు వ్యక్తులు చంపడానికి కొన్ని రోజుల ముందు.. టైలర్ కన్హయ్య లాల్ తనకు నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైందని సమాచారం.
