Asianet News TeluguAsianet News Telugu

క్యాబ్ డ్రైవర్ 27 రూపాయాలకు కక్కుర్తి పడితే.. Uber కు రూ. 28 వేల జరిమానా.. అసలేం జరిగిందంటే?

Uber: ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ యాప్ ఉబర్ ద్వారా టాక్సీని బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఆ ట్యాక్సీ డ్రైవర్ నిర్ణీత ఛార్జీ కంటే ఎక్కువగా వసూలు చేస్తే.. ఆ సంస్థ భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ? 
 

Uber Cab Driver Charged Rs 27 More, Uber Fined Rs 28,000 KRJ
Author
First Published Apr 18, 2024, 11:33 PM IST | Last Updated Apr 18, 2024, 11:33 PM IST

Uber: ఇటీవల కాలంలో మనం ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వాహనం ఉండాల్సిన పనిలేదు. క్షణాల్లో ఆన్లైన్ లో బైక్ గానీ, కారు గానీ బుక్ చేసుకుని  గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ ఇలాంటి సేవలందించే వాటిలో ఓలా, ర్యాపిడో,ఉబర్ వంటి సంస్థలు ప్రముఖమైనవి. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రయాణం చాలా సులువైపోయింది. దీంతో ఆ సంస్థలకు డిమాండ్ పెరిగింది. అయితే.. ఇదే అదునుగా భావించిన కొంతమంది క్యాబ్ డ్రైవర్లు వినియోగదారులను మోసం చేస్తున్నారు.

నిర్ణీత ధర కంటే.. ఎక్కువ మొత్తంలో వసూల్ చేస్తూ.. ఆయా సంస్థలకు చెడ్డ పేరు వస్తున్నారు.  తాజాగా అలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి నిర్ణీత ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేస్తే..  ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబెర్ ఇండియా ఏకంగా రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. 
  
వివరాల్లోకెళ్తే.. పంజాబ్‌కు చెందిన రిత్విక్‌గార్గ్‌.. 2022 సెప్టెంబరు 19న  ఉబెర్ యాప్ ద్వారా చండీగఢ్‌లోని సెక్టార్ -21 నుండి సెక్టార్ -13 మణిమజ్రాకు క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో యాప్‌లో 7.82 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ రూ.53 చార్జ్ చేస్తున్నట్టు చూపించింది. మణిమజ్ర వద్దకు రాగానే డ్రైవర్ కైలాష్ అతడి నుంచి రూ.80 ఛార్జీ వసూలు చేశాడు. ఈ విషయంపై రిత్విక్ ఉబర్ కంపెనీకి ఫిర్యాదు చేయడంతోపాటు పలుమార్లు మెయిల్స్‌ ద్వారా ఉబర్‌ ఇండియా దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో కంపెనీకి లీగల్ నోటీసు పంపారు. 

అయినప్పటికీ, అతని ఫిర్యాదుపై కంపెనీ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది. తాము యాప్‌ రూపంలో కేవలం టెక్నాలజీ సర్వీస్‌ మాత్రమే ఇస్తామని, తాము కేవలం డ్రైవర్లు, కస్టమర్లను అనుసంధిస్తామని, ప్రయాణ సేవలు అందించడం తమ పని కాదని, కేవలం టాక్సీ సేవలను మాత్రమే అందిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఉబెర్ ఇండియా.  

బుకింగ్ సమయంలో ధర రూ.53గా కోట్ చేయబడింది. కానీ డ్రైవర్ 80 రూపాయలు తీసుకున్నాడు. సెప్టెంబరు 22, 2022న లీగల్ నోటీసు పంపడం ద్వారా ఉబెర్ ఇండియాతో సమస్యను లేవనెత్తానని, ఆపై ఇ-మెయిల్ ద్వారా తన ఫిర్యాదును పరిష్కరించలేదని గార్గ్ చెప్పారు. అనంతరం ఫిర్యాదును ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కమిషన్ నిర్ణయం వెలువడింది. సంబంధిత డ్రైవర్‌పై చర్య తీసుకోవడానికి ఉబెర్ ఇండియా ఎటువంటి దర్యాప్తు నివేదికను నమోదు చేయలేదని కమిషన్ తెలిపింది. దీంతో రిత్విక్‌ గార్గ్‌ చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. 

ఉబర్‌ ఇండియా సమాధానంపై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. డ్రైవర్‌ అధికంగా వసూలు చేస్తున్నాడని తెలిసి కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని తేల్చింది. సంబంధిత డ్రైవర్‌పై చర్య తీసుకోవడానికి Uber ఇండియా యాప్ ఎటువంటి దర్యాప్తు నివేదికను నమోదు చేయలేదని కమిషన్ తెలిపింది. కస్టమర్‌ చెల్లించే డబ్బుల్లో కొంత ఉబర్‌కు వెళ్తున్న నేపథ్యంలో కచ్చితంగా బాధ్యత వహించాల్సిందేనని, డ్రైవర్ల ప్రవర్తన సక్రమంగా ఉందో, లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కంపెనీదేనని తేల్చి చెప్పింది కమిషన్.

అదనంగా తీసుకున్న రూ.27తో పాటు ఫిర్యాదుదారు రిత్విక్‌గార్గ్‌కు రూ.5,000 పరిహారం, రూ.3,000 ఖర్చుల కింద చెల్లించాలని ఉబర్‌ ఇండియాను కమిషన్‌ ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలను అడ్డుకునేందుకు కమిషన్‌ లీగల్‌ ఎయిడ్‌ ఖాతాలో రూ.20,000 జమ చేయాలని తెలిపింది. కస్టమర్ల సమయాన్ని దృష్టిలోఉంచుకొని ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇలా వ్యవహరించడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios