వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2024: యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్ కీలక వ్యాఖ్యలు
వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన షేక్ మహమ్మద్ బిన్ జాహెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గాంధీనగర్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడుషేక్ మొహమ్మద్ బిన్ జాహెద్ అల్ నహ్యాన్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా అల్ నహ్యాన్ పబ్లిక్ ఫోరమ్ లలో మాట్లాడరు. యూఏఈలో జరిగిన కాప్ -28 సదస్సులో కూడ నహ్యాన్ మాట్లాడలేదు. కానీ గుజరాత్ లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. భారత దేశం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పట్ల తనకున్న గౌరవాన్ని చూపాడు. అంతకుముందు యూఏఈ అధ్యక్షుడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు.
డిపి వరల్డ్ గ్రూప్ చైర్మెన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం కూడ ఈ సమ్మిట్ లో ప్రసంగించారు.వచ్చే మూడేళ్లలో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు డీపీ వరల్డ్ ప్లాన్ చేస్తుందని ఆయన చెప్పారు. గుజరాత్ ఆర్ధిక వ్యవస్థకు మద్దతు కొనసాగిస్తామన్నారు.
కాండ్లా ఓడరేవులో 2 మిలియన్ కంటైనర్ల సామర్థ్యంతో అత్యాధునిక కంటైనర్ టెర్మినల్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో డీపీ వరల్డ్ వ్యూహాత్మక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గుజరాత్, భారత్ దేశాల పట్ల తమ నిబద్దతను పునరుద్ఘాటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని తయారీ పరిశ్రమలకు మద్దతిస్తామని ఆయన ప్రకటించారు.
దక్షిణ కొరియా కంపెనీ సిమ్ టెక్ గ్లోబల్ సీఈఓ జెఫ్రీ చున్ కూడ ప్రసంగించారు. గుజరాత్ లో మైక్రోస్ పెట్టుబడి ప్రణాళిక తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు మంచి సహకారం లభిస్తుందని ఆయన చెప్పారు. గుజరాత్ లో అత్యంత నైపుణ్యం గల ప్రతిభావంతులకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ఆయన చెప్పారు.