కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా మహారాష్ట్ర తర్వాత అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతోంది దేశ రాజధాని ఢిల్లీ. ప్రతిరోజూ వేలాది కేసులతో పాటు వందల సంఖ్యలో మరణాలతో హస్తిన వణికిపోతోంది.

వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బెడ్ల కొరత ఉన్నప్పటికీ అది ఢిల్లీ స్థాయిలో లేదు. దీనికి తోడు ఆక్సిజన్ నిల్వలు గంటల వ్యవధిలోనే  నిండుకుంటున్నాయి. తమకు ఆక్సిజన్ అందించాలంటూ ఢిల్లీ సర్కార్.. కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. 

కాగా దేశ రాజధానిలోని ప్రస్తు పరిస్థితుల నేపథ్యంలో టర్న్‌ యువర్‌ కన్సర్న్‌ ఇన్‌ టూ యాక్షన్‌ (టీవైసీఐఏ) సంస్థ రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్‌లను సిద్ధం చేసింది. టీవైసీఐఏ సంస్థ రాజ్యసభతో కలిసి 10 ఆటో అంబులెన్స్‌ను సిద్ధం చేసింది.

Also Read:కరోనా రోగులకు నేరుగా ఆక్సిజన్: ఢిల్లీ సర్కార్ ప్రయోగం

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్‌ పేషెంట్లను ఈ ఆటోరిక్షాల్లో ఆసుపత్రులకు చేరుస్తారు. వీటిని పూర్తిగా శానిటైజ్‌ చేసి ఆక్సిజన్‌తో అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు చెప్పారు. ఈ విషయాన్ని టీవైసీఐఏ సంస్థ ట్విటర్లో షేర్‌ చేసింది. ఈ ఆటో అంబులెన్స్‌ సంఖ్యను భవిష్యత్తులో మరింత పెంచుతామని వెల్లడించింది. రూ.25 లక్షల నిధులను సమీకరించి దేశ వ్యాప్తంగా ఇటువంటి ఆటో అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.