ఒక్క యువకుడి కోసం.. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒకరిని మరొకరు విపరీతంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో  ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన ఓ కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తంజావూరు ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు విభాగంలో  ఇద్దరు యువతులు హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిలో ఒకరికి వివాహం జరగగా.. ఆమె కుటుంబసభ్యులు పుదుకోట్టైలో ఉన్నారు. ఉద్యోగం కోసం ఆమె తంజావూరులో ఉంటోంది.

 ఇద్దరు యువతులు తంజావూరులోని పోలీసు క్వార్టర్స్‌లో ఒకే పోర్షన్‌లో ఉండేవారు. ఈ ఇద్దరిలో పెళ్లి కాని అమ్మాయికి ప్రియుడు ఉన్నాడు. ఈ విషయంలో వివాహితకు కూడా తెలుసు. రోజూ రాత్రి ప్రియుడితో ఫోన్ లో మాట్లాడేది. కాగా.. ఆమెకు తెలియకుండా.. వివాహిత యువతి ప్రియుడితో పరిచయం పెంచుకుంది.

ఈ క్రమంలో వివాహిత.. తన తోటి యువతి ప్రియుడితో ప్రేమలో పడింది. రోజూ గంటల కొద్ది ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే..ఈ క్రమంలో సదరు యువకుడు.. తన అసలు ప్రేయసిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం గ్రహించిన యువతి.. వివాహితతో ఘర్షణకు దిగింది. 

 పెళ్లయి భర్త ఉన్న నీకు ఇదేంపని అంటూ వివాహితను నిలదీసింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోగా కలియబడి కొట్టుకున్నారు. ఈ శబ్దాలు విని ఇతర క్వార్టర్లలోని పోలీసు కుటుంబాలు వచ్చి వారిని అడ్డుకున్నారు.  వివాహిత దాడిలో యువతి గాయపడింది. నీ చేష్టలపై పోలీసు ఉన్నతాధికారులకు, భర్తకు చెబుతానని యువతి బెదిరించడంతో భయపడిన వివాహిత పురుగుల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.