ఇద్దరు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియాలను ఎక్కించుకుని వైమానిక దళం విమానం రాజస్తాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ డ్రిల్‌లో భాగంగా వైమానిక దళం ఈ కార్యక్రమం నిర్వహించింది.
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలతోపాటు ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియాలు ప్రయాణించిన వైమానిక దళ విమానం సీ-130 జే సూపర్ హెర్‌క్యూలస్ సక్సెస్‌ఫుల్‌గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఒక మాక్ డ్రిల్‌లో భాగంగా వైమానిక దళం ఈ ఎమర్జన్సీ ల్యాండింగ్ నిర్వహించింది. ఇందులో భాగంగా రాజస్తాన్‌లోని బర్మార్‌లోని ఓ జాతీయ రహదారిపై వైమానిక దళ విమానాలు ల్యాండ్ అయ్యాయి. తొలుత సీ-130 జే సూపర్ హెర్‌క్యూలస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ డ్రిల్ పూర్తి చేసింది. దాని వెంటే సుఖోయ్ సు-30 ఎంకేఐ ల్యాండ్ అయింది.
అత్యవసర సమయాల్లో సహాయక చర్యల కోసం, లేదా శత్రవులు ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసుకున్నప్పుడు రహదారులను ల్యాండింగ్ కోసం వినియోగించుకునే వ్యూహంలో భాగంగా ఈ డ్రిల్ జరిగింది. ఇందుకోసం వైమానిక దళ విమానాలు సన్నద్ధత, రహదారుల పటిష్టతనూ ఈ డ్రిల్‌లో పరీక్షించారు. ఈ డ్రిల్ సక్సెస్ అయింది. తొలి విమానంలోనే ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రయాణించడం గమనార్హం. ఈ ప్రక్రియను నేలపైనే ఉండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, బిపిన్ రావత్, బదౌరియాలు పాల్గొన్నారు.
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే సహా పలురాష్ట్రాల్లోని 12 హైవేలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కేంద్రం గుర్తించింది. వీటికితోడు పశ్చిమ సరిహద్దు ముప్పును దృష్టిలో పెట్టుకుని కుందన్‌పుర, సింఘానియా, భాక్సర్ గ్రామాల్లో మూడు హెలిప్యాడ్‌లను నిర్మించింది. వైమానిక దళం సమన్వయంతో వీటిని నిర్మించింది. వైమానిక దళ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసింది.