మధ్యప్రదేశ్‌లో ఇద్దరు గిరిజనులు గోవును వధించారని ఓ మూక దారుణంగా భౌతిక దాడికి దిగింది. ఈ దాడిలో వారిద్దరూ మరణించారు. మరో గిరిజనుడు గాయాలపాలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సియోని జిల్లాలో గోవును వధించారన్న ఆరోపణలతో ఓ మూక ఇద్దరు గిరిజనులను పొట్టనబెట్టుకుంది. ఆ ఇద్దరు గిరిజనులను తీవ్రంగా దాడి చేసి చంపేసింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సుమారు 20 మంది దుండగులు కలిసి ఈ దాడికి పాల్పడ్డట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. 20 మందిపై కేసు ఫైల్ చేశామని, అందులో ఆరుగురిపై హత్యా నేరారోపణలు నమోదు చేసినట్టు తెలిపారు.
సియోని జిల్లాలో ఇద్దరు గిరిజనులు గోవును వధించినట్టు కొందరు భావించారు. ఈ ఆరోపణలతో 15 నుంచి 20 మంది దుండగులు బాధితుడి ఇంటిలోకి చొరబడ్డారు. వారు గోవును చంపారని ఆరోపించారు. అనంతరం వారిపై దాడి ప్రారంభించారు. వారిద్దరినీ తీవ్రంగా హింసించారు. అనంతరం వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మరణించారు. కాగా, అదే సమయంలో ఇంకొకరు అక్కడికి వెళ్లారు. ఆ గిరిజనుడికి కూడా గాయాలైనట్టు అదనపు ఎస్పీ ఎస్కే మారవి వివరించారు.
మర్డర్ కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన వివరించారు. 20 మందిపై కేసు నమోదు చేశామని, అందులో కొందరి పేర్లు నమోదు చేశామని, కాగా, ఇంకొందరిని ఇంకా గుర్తించాల్సి ఉన్నదని తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. సుమారు 12 కిలోల మాంసం బాధితుల ఇంట్లో లభించిందని వివరించారు.
గాయాలతో బయటపడ్డ బ్రజేష్ బట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మృతుల పేర్లు సంపత్ బట్టి, ధంసాలుగా పేర్కొన్నారు. కాగా, ఘటనపై వెంటనే ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తును ఆదేశించాలని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనకు బజ్రంగ్ దళ్‌తో లింకులు ఉన్నట్టు స్థానికులు కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
