Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్‌లో ఇద్దరు అల్‌ఖైదా ఉగ్ర సంస్థ అనుమానితుల అరెస్ట్..

పశ్చిమ బెంగాల్‌లో అల్-ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బరాసత్ బ్లాక్ పరిధిలోని షాషన్ గ్రామం నుంచి వారిని బుధవారం రాత్రి పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. 

Two suspects with Al Qaeda links Arrested in west Bengal
Author
First Published Aug 18, 2022, 2:33 PM IST

పశ్చిమ బెంగాల్‌లో అల్-ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బరాసత్ బ్లాక్ పరిధిలోని షాషన్ గ్రామం నుంచి వారిని బుధవారం రాత్రి పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరిని రకీబ్ సర్కార్, కాజీ అహ్షానుల్లాగా గుర్తించారు. వీరిద్దరూ భారత ఉపఖండంలో అల్-ఖైదా (AQIS) సభ్యులని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందులో రకీబ్ సర్కార్ శ్చిమ బెంగాల్‌కు ఆపరేషన్-ఇన్‌చార్జ్‌గా ఉన్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

బుధవారం సాయంత్రం షాషన్‌లోని కాజీ అహ్షానుల్లా నివాసానికి సర్కార్ వస్తాడని తమకు సమాచారం అందిందని ఎస్టీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఆ సమాచారం ప్రకారం రకీబ్ సర్కార్‌ను పట్టుకునేందుకు ప్లాన్ వేసినట్టుగా చెప్పాయి. షషన్‌కు చేరుకోగానే అహ్షానుల్లాతో పాటు రకీబ్ సర్కార్‌ను పట్టుకున్నామని తెలిపాయి. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో వీరిద్దరి అరెస్టు ఒక పెద్ద విజయంగా పోలీసుల వర్గాలు భావిస్తున్నాయి.

ఇక, వారి వద్ద నుంచి ఉగ్రవాదానికి సంబంధించిన అనేక పుస్తకాలు, ప్రచార కరపత్రాలు, డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్‌లు, మొబైల్ సిమ్‌కార్డులు లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిపుణుల సహాయంతో అధికారులు వాటిని పరిశీలించనున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల నుంచిపశ్చిమ బెంగాల్‌లోని AQIS నెట్‌వర్క్ గురించి అదనపు కీలక సమాచారం లభించే అవకాశం ఉందని వారు విశ్వసిస్తున్నారు. వారిద్దరినీ గురువారం బరాసత్‌లోని కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం పోలీసులు వారిని కస్టడీకి కోరనున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో రకీబ్ సర్కార్, కాజీ అహ్షానుల్లాపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తిరుగుబాటు కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉంటున్న వీరిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్‌పోర్స్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, రకీబ్ సర్కార్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని గంగానగర్ మునిసిపాలిటీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా, కాజీ అహ్షానుల్లా వాస్తవానికి హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్ మునిసిపాలిటీ ప్రాంతానికి చెందినవాడు. అతడికి కోల్‌కతాలోని టాప్సియా ప్రాంతంలో నివాసం కూడా ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios