ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో అండర్‌పాస్‌లో కారును ఆపి తుపాకీతో దోచుకున్నారు. ఈ ఘటన సీసీటీవీలో కూడా రికార్డైంది. ఈ దోపిడీ కేసులో ఢిల్లీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు, మరో ఇద్దరి కోసం అన్వేషణ కొనసాగుతోంది
దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో కారును వెంబడి.. తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి మైదాన్ ప్రాంతంలో రద్దీగా ఉండే అండర్‌పాస్‌లో నలుగురు గుర్తుతెలియని దుండగులు కారును ఆపి, తుపాకులతో బెదిరించి ప్రయాణికులను దోచుకుంటున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ పోలీసులకు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేశారు. ఇద్దరూ నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన వెనుక ఎవరైనా అంతర్గత వ్యక్తులు ఉన్నారా? అని నిర్ధారించడానికి ఫిర్యాదుదారులు, వారి యజమాని , ఇతర ఉద్యోగులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడ్డ తీరును చూస్తుంటే.. దుండగుల్లో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. ఓవర్‌టేక్ చేస్తూ క్యాబ్‌ను ఆపిన దుండగులు నగదుతో కూడిన బ్యాగును దోచుకెళ్లారు. కొద్ది క్షణాల్లోనే దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాజధానిలో జరిగిన పగటి దోపిడీ ఘటన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీలోని జరత్‌లోని మెహసానాలో నివాసముంటున్న సజన్‌కుమార్‌కు చాందినీ చౌక్‌లో జ్యూవెలరీ షాపు ఉంది. గురుగ్రామ్‌లోని ఓ సంస్థకు రూ.2 లక్షలు డెలివరీ చేసేందుకు శనివారం మధ్యాహ్నం తన స్నేహితుడు జితేంద్ర పటేల్‌తో కలిసి క్యాబ్‌లో వెళ్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో రింగ్‌రోడ్డు నుంచి ప్రగతి మైదాన్ టన్నెల్ మీదుగా ఇండియా గేట్ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురు దుండగులు అతని వెంబడించుకుంటూ.. వచ్చారు. ఒక్కసారిగా కారు ముందు మోటార్‌సైకిల్‌ను ఆపి ..తుపాకులతో బెదిరించారు. ఈ క్రమంలో డబ్బులతో కూడిన బ్యాగును లాక్కున్నారు. నగదును దోచుకుని దుండగులు వెంటనే పరారయ్యారు. ఈ ఘటన అంతా క్షణాల్లో జరిగిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దుండగులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పాత ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో దర్యాప్తు చేస్తున్నాయి.ఇన్‌ఫార్మర్ తర్వాతే దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారని విచారణలో తేలింది.
ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారు?
క్యాబ్‌లో డెలివరీ ఏజెంట్, అతని సహచరుడు ఉన్నారని, ఇద్దరూ తీసుకెళ్లిన బ్యాగ్‌లలో రూ. 1.5 నుండి రెండు లక్షల నగదు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఓమియా ఎంటర్‌ప్రైజెస్‌లోని చాందినీ చౌక్‌లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుడు తన సహోద్యోగితో కలిసి డెలివరీ చేసేందుకు వచ్చానని శనివారం తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ) ప్రణవ్ తాయల్ తెలిపారు. ఫిర్యాదుదారుడు , అతని సహచరుడు ఎర్రకోట నుండి క్యాబ్ తీసుకొని రింగ్ రోడ్ ద్వారా గురుగ్రామ్‌కు వెళుతుండగా సొరంగం లోపలికి ప్రవేశించినప్పుడు, రెండు బైకులపై నలుగురు దుండగులు తమను ఆపి తుపాకీతో బలవంతంగా ఖర్చు చేశారని ఫిర్యాదును పేర్కొన్నరని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకున్నామని, మరో ఇద్దరూ నిందితుల గురించి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
