మధ్యప్రదేశ్‌లో ఇద్దరు యువకులు కోచింగ్ ఫీజు, రూమ్ రెంట్ల కోసం రూ. 40వేల దొంగతనం చేశారు. ఓ బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్న కుటుంబాన్ని చూసి వారి నుంచి డబ్బులు ఉన్న బ్యాగ్‌ను బైక్ పై వచ్చి లాక్కెళ్లిపోయారు.
భోపాల్: కుటుంబాలను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని, కాంపిటీటివ్ పరీక్ష కోచింగ్‌లకు ఫీజు చెల్లించడాానికి డబ్బులు లేకుండా పోయాయని, అందుకే తాము దొంగతనం చేయాల్సి వచ్చిందని ఇద్దరు స్టూడెంట్లు పోలీసులకు చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఓ జంట వద్ద నుంచి రూ. 40 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కెళ్లారు. పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. వారు ఈ విధంగా తెలిపారు.
రేవా జిల్లాకు చెందిన అర్పన్ శుక్లా (19), అభిషేక్ శుక్లా అలియాస్ బాచ్చి (18.6 సంవత్సరాలు) స్టూడెంట్లు తమ అవసరాల కోసం నేరమార్గాన్ని ఎంచుకున్నారు. ఈ చోరీ కోసం వారు కొంత కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు గోసల్‌పూర్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ హెచ్ఆర్ సిన్హా తెలిపారు. బుదాగర్ గ్రామంలోని బ్యాంక్ దగ్గర పలుమార్లు వారు రెక్కీ చేశారు. జులై 13న నేరం చేశారు. ఇద్దరు దంపతులు ఆ ఊరి బ్యాంకు నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 40 వేలు ఉపసంహరించుకున్నారు.
అనంతరం వారు బ్యాంకు నుంచి ఇంటికి బయల్దేరుతూ మార్గం మధ్యలో ఫ్రూట్స్ కొనుగోలు చేయడానికి దారిలో ఆగారు. ఇదే అదునుగా తీసుకుని అర్పన్, అభిషేక్‌లు ఓ బైక్‌పై అటుగా వచ్చారు. వారి నుంచి డబ్బులు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని వేగంగా బండిపై వెళ్లిపోయారు. ఆ దంపతులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆ దొంగల కోసం ముందుగా సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఆ ఇద్దరు యువకులను వారు గుర్తించారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.
వీరిని ఇంటరాగేట్ చేస్తుండగా.. అర్పన్ కీలక విషయాలు వెల్లడించాడు. తమ కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నదని చెప్పాడు. తాను కాంపిటీటివ్ ఎగ్జామ్‌ల కోసం కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నానని వివరించాడు. కానీ, తన కుటుంబం తనకు ఈ కోచింగ్ ఫీజు, జబల్‌పూర్‌లో ఉండటానికి రూమ్ రెంట్‌కు కూడా డబ్బులు పంపించలేకపోతున్నదని అన్నాడు. అందుకే తాను ఈ డబ్బు దొంగిలించానని పేర్కొన్నాడు.
అర్పన్ మిత్రుడు అభిషేక్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆయన కూడా ఆర్థిక సమస్యల గురించి పోలీసులకు తెలిపాడు. వారిని స్థానిక కోర్టుకు జైలుకు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
