దేశ రక్షణ చేయాల్సిన జవాన్లే బలవన్మరణానికి పాల్పడిన దారుణ సంఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు సర్వీస్ రివాల్వర్ లతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెడితే  ఛత్తీస్‌గఢ్‌ లోని సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. మనసు మెలిపెట్టే ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.  

సుక్మా జిల్లా లోని పుష్పల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం దినేశ్ వర్మ (35) అనే జవాన్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ 4వ బెటాలియన్‌లో విధులు నిర్వహస్తున్నారు. సెలవుపై ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 26న విధుల్లో చేరిన దినేశ్‌ వర్మ మానసిక ఆందోళన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

అలాగే రాష్ట్రం లోని బీజాపూర్‌ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వినోద్‌ పోర్సే (29) అనే జవాన్‌ ఆదివారం ఉదయం వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.