ఇద్దరు పెళ్లాల ముద్దులపోలీసు.. ఏవండీ ఆవిడొచ్చింది.. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఇవన్నీ తెలుగు హిట్ సినిమా కాన్సెప్ట్స్.. ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో జరగడం అరుదు. ఓ వర్షం కురిసిన రాత్రి జరిగిన తప్పిదంతో ఓ వ్యక్తి ఇద్దరికీ భర్త అయి నలిగిపోయే సినిమాల్ని ఓ తరం ప్రేక్షకులు బాగా హిట్ కొట్టించారు. అయితే నిజజీవితంలో ఇలాంటి వాటిని తలదన్నే సంఘటన జరిగింది...

స్వయంగా ఓ అక్కే తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని.. వరుడిని పట్టుబట్టింది.. అలాగయితేనే తానూ పెళ్లికి అంగీకరిస్తానని మొండికేసింది. దీంతో వరుడు ఇద్దరి మెడలోనూ తాళి కట్టాడు. ఈ విచిత్రం సంఘటన కర్ణాటకలో జరిగింది. 

సాధారణంగా సినిమాల్లో చూసే .నాటకీయ పరిణామాల మధ్య అక్కాచెల్లెళ్లను ఒక్కడే పెళ్ళాడడం అనే వింతలు నిజజీవితంలో అరుదుగా జరుగుతుంటాయి. కానీ, కర్ణాటకలోని కోలారు జిల్లా తాలూకాలోని మడుగు గ్రామంలో ఇలాంటి వింత జరిగింది.

తన చెల్లిని కూడా వివాహం చేసుకోవాలని అక్క కాబోయే భర్తను పట్టుబట్టి ఒప్పించడం విశేషం. వివరాలలోకి వెళ్తే తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయితీ  వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చెల్లెలు లలిత మూగ-బధిర. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రియ బాధపడేది.

ఈ తరుణంలో సుప్రియకు చెందిన ఉమాపతి అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల ఏడవ తేదీన పెళ్లి మండపంలో బరువు తాళి కట్టబోతుండగా సుప్రియ తన ఆలోచన చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని మొండికేయడంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. 

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూడగా సోషల్ మీడియాలో ఇద్దరు భామల ముద్దుల మొగుడు వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వింత ఘటనలో చివర్లో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. సుప్రియ చెల్లెలు.. రెండో వధువు అయిన  లలితకు ఇంకా పద్దెనిమిదేళ్లు నిండలేదని తెలియడంతో శిశుసంక్షేమ శాఖ, పోలీసు అధికారులు వరుడితో సహాఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.