Nipah: నిపా వైరస్ తో ఇద్దరు మృతి.. మరో కొత్త కేసు నమోదు, కేరళలో పెరుగుతున్న కంటైన్‌మెంట్ జోన్లు
Nipah alert: నిపా వైరస్ సంక్రమిస్తే మరణం సంభవించే రేటు అధికంగా ఉంటుంది. ఇప్పటివరకు దీని చికిత్స ఎటువంటి నిర్థిష్టమైన మందులు, వ్యాక్సిన్లు లేవని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, అందుబాటులో ఉన్న వివిధ మందులు, వ్యాక్సిన్లతో చికిత్స అందిస్తున్నారు. నిఫా అనేది జూనోటిక్ వైరస్, ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మొదట గుర్తించిన మలేషియా గ్రామం పేరు మీద పెట్టారు.
Nipah virus: నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఐదు కేసులు గుర్తించగా, అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే మరోకరికి నిపా వైరస్ సోకినట్టు తాజా పరీక్షల్లో వెల్లడైంది. దీంతో కేరళలో నిపా వైరస్ సోకిన వారి సంఖ్య ఆరుకు చేరింది. అప్రమత్తమైన సర్కారు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. పలు ప్రాంతాలను అలర్ట్ జోన్లుగా ప్రకటించింది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో 39 ఏళ్ల వ్యక్తి నమూనా పాజిటివ్‌గా మారడంతో శుక్రవారం మరో నిపా వైరస్ సంక్రమణ కేసు నిర్ధారించబడింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. ఆ వ్యక్తి ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నాడనీ, నిపా-పాజిటివ్ బాధితులు ఇతర వ్యాధులకు గతంలో చికిత్స పొందిన ప్రయివేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిపా వైరస్ మొత్తం కేసులు ఆరు కాగా , ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించడంతో యాక్టివ్ కేసులు నాలుగుగా ఉన్నాయి. కేరళలో నిపా వ్యాప్తి నేపథ్యంలో కోజికోడ్‌లోని అన్ని విద్యాసంస్థలకు గురు, శుక్రవారాల్లో కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎ గీత సెలవు ప్రకటించారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, విద్యాసంస్థలు విద్యార్థులకు రెండు రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు ఏర్పాటు చేయవచ్చని ఆమె తెలిపారు.
24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త కేరళలో ఇటీవలి వ్యాప్తి కారణంగా బుధవారం ఐదవ నిపా కేసుగా ధృవీకరించబడింది. కాగా, ప్రస్తుత పరిస్థితులపై భయపడాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం కూడా జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం పరిస్థితిని క్షుణ్ణంగా విశ్లేషించగా, వీణా జార్జ్ మాట్లాడుతూ.. సాధ్యమైన అన్ని నివారణ చర్యలు అమల్లో ఉన్నాయని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వీణా జార్జ్ చెప్పారు.
కోజికోడ్‌లోనే కాకుండా కేరళ రాష్ట్రం మొత్తం ఇలాంటి ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ICMR అధ్యయనాలు కనుగొన్నాయని మంత్రి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని జార్జ్ చెప్పారు. నిపా వైరస్ తాజా కేసు అడవి ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉందని తెలిపారు. మంగళవారం ప్రకటించిన వాటితో పాటు మరో నాలుగు వార్డులు - కోజికోడ్ జిల్లాలో విల్యపల్లి పంచాయతీలో మూడు, పురమేరి పంచాయతీలో ఒకటి బుధవారం కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించబడ్డాయి. వ్యాధి తీవ్రమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకునీ, కోజికోడ్ పరిపాలన మంగళవారం ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించింది.