ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. టిక్రీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతంలో ఓ 38 యేళ్ల రైతు గురువారం ఉదయం చనిపోయాడు. 

మృతుడు బతిండా జిల్లా, తుంగ్వాలి గ్రామనికి చెందిన జైసింగ్ గా గుర్తించారు. జైసింగ్ సోదరుడు కూడా ఈ నిరసన కార్యక్రమంలో ఉన్నాడు. అతను హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసనకేంద్రాల్లో గత కొద్ది రోజులుగా ఉన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. 

జైసింగ్ మరణానికి అసలు కారణం పోస్టు మార్టం తరువాతే తెలుస్తుందని బహదూర్ గర్ పోలీసులు అంటున్నారు. అయితే జైసింగ్ కుటుంబ సభ్యులు మాత్రం అతను హార్ట్ ఎటాక్ తో చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జైసింగ్ మృతదేహాన్ని జజ్జర్ జిల్లాలోని బహదూర్ గర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. 

నిరసనలో మరణించిన వారికి పది లక్షల రూపాయల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వలని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా సింజు సరిహద్దులోని కాలువలో పడి పంజాబ్ సంగ్రూర్ కు చెందిన మరో రైతు  మరణించాడు.

మృతుడు పంజాబ్ లోని పిర్ సంగ్రూర్ కు చెందిన రామ్ సింగ్ కుమారుడు భీమ్ సింగ్ గా గుర్తించారు. భీమ్ సింగ్ రైతు ఉద్యమంలో మొదటి నుంచీ ఉన్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సోనిపట్ లోని సివిల్ ఆసుపత్రికి పంపారు.

ఉద్యమం ప్రారంభమైన దగ్గరినుండి ఇప్పటివరకు దాదాపు  20 మంది రైతులు రకరకాల కారణాల వల్ల మరణించారని, వారిలో చాలా మంది పంజాబ్‌కు చెందినవారేనని బికెయు (ఏక్తా ఉగ్రహాన్) నాయకుడు షింగారా సింగ్ తెలిపారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని, కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయంటూ, సాంప్రదాయ టోకు మార్కెట్లు, కనీస మద్దతు ధరల పాలనను గొడ్డలి పెట్టులా మారబోతున్నాయని.. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మూడు వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.