ఇటీవల ఇద్దరు తెలుగు డాక్టర్లు... దేశ రాజధాని ఢిల్లీలో మిస్సైన సంగతి తెలిసిందే. కాగా... ఆ ఇద్దరు డాక్టర్లు సురక్షితంగా దొరికారు. వారి ఆచూకీని సిక్కింలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో వారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. 

వెంటనే ప్రత్యేక పోలీసు టీంనీ సిక్కిం పంపించి మరీ... వారిని సురక్షితంగా ఢిల్లీకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు కూడా తెలియజేశారు. కాగా... కుటుంబసభ్యుల సమక్షంలోనే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా... దిలీప్‌, హిమబిందు, శ్రీధర్‌ ఈ ముగ్గురు కర్నూల్‌ మెడికల్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. చండీగఢ్‌లో  చిన్న పిల్లల వైద్యునిగా దిలీప్‌ పనిచేస్తున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా ఢిల్లిలోని శ్రీధర్‌ దంపతుల ఇంట్లో ఆగారు. 

అనంతరం ఉదయం 11.30 నిమిషాల సమయంలో దిలీప్‌తో కలిసి చర్చికి వెళ్తున్నానని చెప్పి హిమబిందు, దిలీప్‌ బయటికి వెళ్లారు. కాసేపటి తరువాత ఇద్దరి మొబైల్‌ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో బిందు భర్త శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరి ఆచూకీ కనిపెట్టాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ , ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్లను అభ్యర్థించారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలించారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా హత్యకు గురయ్యారా? అనేకోణంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వారి బ్యాంక్ ఎకౌంట్స్ పై నిఘా పెట్టారు.  

అలాగే వారి సోషల్ మీడియా ఎకౌంట్స్ పై కూడా నిఘా పెట్టారు. వారి ఎకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేయటం..ఎక్కడెక్కడ డ్రాలు జరుగుతున్నాయి? క్రెడిట్ కార్డులు ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి అనే కోణంలో నిఘా పెట్టారు. దీంతో వారు సిక్కింలో ఉన్నట్లుగా పోలీసు బృందాలు గుర్తించాయి. 

దిలీప్ సత్య, హిమబిందులు మిస్ అవ్వటంతో తీవ్రమైన సంచలనం సృష్టించింది.  వారి ఆచూకీ గురించి తెలిసినవారు వెంటనే తెలియజేయాలంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఢిల్లీలోని డాక్టర్స్ అసోసియేషన్స్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.