భువనేశ్వర్: ఒడిశాలోని భువనేశ్వర్ లో దిగ్భ్రాంతికరమైన నేర సంఘటన జరిగింది. తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. కన్నతల్లిని అత్యంద పాశవికంగా హత్య చేసి, శవాన్ని బాత్రూంలో పడేశారు. 

బుధవారం రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు మైనర్ కుమారులతో కలిసి భువనేశ్వర్ లోని ఓ అపార్టుమెంటులో ఉంటోంది. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి ఆ ఇద్దరు పిల్లలను వేధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో తల్లిపై పిల్లలు కక్ష పెంచుకున్నారు. 

బుధవారం రాత్రి తాగి వచ్చి ఆమె పిల్లలపై కేకలు వేయడం ప్రారంభించింది. దాంతో ఆగ్రహం చెందిన పిల్లలు పాలిథిన్ కవరుతో తల్లి ముఖాన్ని కప్పి, రాడుతో తలపై బలంగా కొట్టారు. ఊపిరి ఆడకపోవడంతో, రక్తస్రావం విపరీతంగా కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 

తల్లి మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత మైనర్లు శవాన్ని  బాత్రూంలో పడేశారు. పెంపుడు కుక్కను తీసుకుని అపార్టుమెంట్ గార్డు వద్దకు పరుగెత్తారు. తమ ఇంట్లో దుండగులు చొరబడి తల్లిని కొట్టి చంపారని అతడితో చెప్పారు. గార్డు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో మైనర్లు తమ నేరాన్ని అంగీకరించారు.