కుక్కలు, పిల్లులకు వేడుకలు చేయడం నేటి రోజుల్లో ట్రెండ్ గా మారిపోయింది. పుట్టినరోజులు, సీమంతాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఇద్దర మరో అడుగు ముందుకు వేసి కుక్కలకు ఘనంగా పెళ్లి చేసి, భారీగా విందుభోజనం ఏర్పాటు చేశారు.

ఉత్తర ప్రదేశ్ : పెంపుడు జంతువుల పట్ల యజమానుల ప్రేమ అపారమైనది. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తన కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తారు. వాటితో సరదాగా గడుపుతారు. కొందరు తమ పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి వంటి వాటికి తమ ఆస్తులు కూడా రాసిన సందర్భాల గురించి తరచుగా వింటూనే ఉంటాం. ఫ్యాషన్ షోలు సర్వసాధారణమే.. అయితే గత కొంత కాలంగా కుక్కలు, పిల్లుల వంటివాటికి వేడుకలో సైతం జరిపిస్తున్నారు.

పుట్టినరోజులు, సీమంతం.. ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇరువురు వ్యక్తులు మరో అడుగు ముందుకు వేసి రెండు కుక్కలకు పెళ్లి చేసి.. ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ హమీర్ పూర్ జిల్లాలోని సుమెర్ పూర్ లో ఇద్దరు పూజారులు వినూత్నంగా ఆలోచించారు. తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించాలని అనుకున్నారు. 

అనుకున్నదే తడవుగా హిందూ సంప్రదాయం ప్రకారం వారి పెంపుడు కుక్కలకు వివాహం జరిపించారు. సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయం ఉంది. ఆ గుడిలో ప్రధాన పూజారి స్వామి ద్వారకా దాస్ మహారాజ్ అనే అతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. ఈ కుక్కకు వివాహం చేయాలని అనుకున్న ఆయన పరఛాచ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంచుకునే ఆడ కుక్కతో వివాహం నిశ్చయించాడు. జూన్ 5న ముహూర్తం పెట్టి తన శిష్యులను, భక్తులను ఆహ్వానించాడు. వైభవంగా వివాహం జరిపించి, 500 మందితో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెళ్లి తర్వాత అతిథులకు రకరకాల వంటకాలతో భోజనాలు కూడా వడ్డించారు.