జైపూర్: రాజస్థాన్ లో దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అమ్మాయిలపై అఘాయిత్యానికి గురయ్యారు. రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలోని ఖాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 గంటల వ్యవధిలో ఈ రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

తల్లిదండ్రులు ఉపాధి హామీ పనికి వెళ్లడంతో బుధవారం మధ్యాహ్నం 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని స్థానిక యువకుడు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. సాయంత్రం ఇంటికి వచ్ిచన తల్లిదండ్రులు బాలిక పరిస్థితి చూసి ఏమైందని అడిగారు. 

దాంతో ఆమె అసలు విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటికే యువకుడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరో సంఘటనలో 13 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. మంగళవారం రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. బుధవారంనాడు బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు తల్లిదండ్రులతో పాటు నిద్రించింది. యువకుడు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచాడు. బయటకు వచ్చిన బాలికపై అతను అత్యాచారం చేశాడు. 

ప్రేమించానంటూ అతను గతంలో కూడా బాలిక వెంట పడుతూ వచ్చాడని అంటున్నారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాలికలను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.