కూతురి మరణం సాధారణంగా ఏ తల్లినైనా మామూలు స్థితికి తీసుకురావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అందునా ఒక చిన్న పాపని లోకం అనుకుంటూ... ఆ చిట్టి తల్లి మీదనే అన్ని ఆశలను పెట్టి చూసుకుంటున్న తల్లికి ఆ పాప మరణిస్తే ఒక్కసారిగా లోకమే ఆగిపోయినట్టవుతుంది. 

కానీ ఈ తల్లి మాత్రం 13 సంవత్సరాల కూతురు మరణ వార్తను దిగమింగి రెండు రోజుల్లోనే తిరిగి విధుల్లోచేరి కరోనా లాక్ డౌన్ విధులను నిర్వహిస్తూ అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 

ఈమె ఇప్పుడు లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న వారందరికీ ఆదర్శంగా నిలుస్తుంటే... ప్రజలందరికీ.... పోలీసులతోసహా ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్న వారందరూ తమ కుటుంబాలను, బాధలను అన్నిటిని పక్కన పెట్టి ఎలా విధులు నిర్వహిస్తున్నారో అర్థమయ్యేలా చేస్తుంది. 

ఈమె కర్తవ్య దీక్షను, నిబద్ధతను చూసి స్వయంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెను మెచ్చుకున్నారు. ఆమెలాంటివారు అందరికీ ఇన్స్పిరేషన్ అని ఆయన ట్విట్టర్ వేదికగా కొనియాడారు. 

వివరాల్లోకి వెళితే... గౌరి బెహరా అనే మహిళా హోమ్ గార్డ్ గా ఒరిస్సా పూరి జిల్లాలోని పిపీలి పోలీస్ స్టేషన్ లో 1998 నుంచి పనిచేస్తున్నారు. రెండు రోజుల కింద ఆమెకు రాత్రి 8 గంటల ప్రాంతంలో లివర్ కాన్సర్ తో బాధపడుతున్న తన కూతురు లోపముద్ర పరిస్థితి విషమించిందనే విషయం తెలుసుకొని తన సైకిల్ మీద మూడు కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి బయల్దేరి వెళ్ళింది. 

ఆమె అక్కడకు చేరుకునే సరికే... ఆ పాప ప్రాణాలతో లేదు. పాప చనిపోయిన దుఃఖాన్ని దిగమింగి ఆమె రెండు రోజుల్లోనే వీధుల్లోనే చేరింది. భర్త ఎప్పుడో వదిలేయడంతో ఈమె ఇప్పుడు తల్లితండ్రులు, ఒక మానసికవ్యాధితో బాధపడుతున్న తమ్ముడితో కలిసి ఉంటుంది. ఆ కుటుంబానికి ఈమె ఆదాయమే దిక్కు. 

ఈమె చూపెట్టిన స్ఫూర్తి అందరికి ఆదర్శదాయకమని, ఆమె కూతురు మరణానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు జిల్లా ఎస్పీ మీడియాతో అన్నారు. భారతదేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను విజయవంతం చేయడానికి ఇలాంటి మరెందరు హీరోలు పనిచేస్తున్నారో!