డ్యూటీని పక్కనబెట్టి టిక్ టాక్ వీడియోలు చేస్తూ పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సస్పెండ్ అవుతున్నప్పటికీ.. ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌ పోలీస్ శాఖలో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లు విధులను పక్కనబెట్టి టిక్ టాక్ వీడియోలు చేయడంతో ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌లో పీసీఆర్ వ్యాన్ నడుపుతూ ఓ కానిస్టేబుల్, ఆ వాహనం ముందు భాగంలో హీరోలో కూర్చొని మరో కానిస్టేబుల్ టిక్ టాక్‌లో నటించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం పైఅధికారుల దాకా వెళ్లింది.

దీంతో సీరియస్ అయిన పోలీస్ శాఖ.. ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 45 రోజుల క్రితం ఈ వీడియో తీసినప్పటికీ.. ఇప్పుడు వెలుగులోకి రావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

కాగా విశాఖ, ఖమ్మం, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి, కరీంనగర్‌ వైద్య ఆరోగ్యశాఖల్లో పలువురు సిబ్బంది డ్యూటీ సమయంలో టిక్ టాక్ వీడియోలు చేసి సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.