కర్ణాటకలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, గోఖక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి స్పీకర్‌ రమేశ్‌ను కలిసి సోమవారం తమ రాజీనామాలను అందజేశారు.

అనంతరం ఆనంద్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని.. విజయనగర జిల్లాను ఏర్పాటు చేయడం, జిందాల్ స్టీల్ కంపెనీకి బళ్లారి జిల్లాలోని 3,667 ఎకరాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలన్న తన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

అందువల్లే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేశానని  ఆనంద్‌సింగ్ తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్లకు అంగీకరిస్తే రాజీనామా విషయంలో పునరాలోచిస్తానని ఆయన తేల్చి చెప్పారు. మరో ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ... మంగళవారం అమావాస్య కావడంతో ఈ రోజే రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నారా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘ప్లాన్ మొత్తం మీకు చెప్పేస్తే ఎలా..? అంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో అత్యవసరంగా భేటీ అయ్యారు.

బీజేపీ అగ్రనేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ... కేంద్ర సంస్థల ద్వారా తమ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా ఐదేళ్ల పాటు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కొనసాగుతుందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో తీవ్రమైన అసంతృప్తి ఉందని.. ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.