రొట్టె విషయంలో ఆ అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఒకరు హత్యకు గురవ్వగా.. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంత‌ర్వా గ్రామానికి చెందిన ర‌మేష్‌కు ఇద్ద‌రు కుమారులు.పెద్ద కుమారుడు జితేంద్ర ట్రాక్టర్ నడుపుతుండగా, చిన్నకొడుకు చోటు తండ్రికి వ్యవసాయంలో స‌హాయం చేస్తుంటాడు. పంతర్వా గ్రామంలో ఒక యువకుడు హత్యకు గురైనట్లు ధూమ‌న్‌‌గంజ్ పోలీసులకు సమాచారం అందింది. ఇంత‌లోనే అతని సోదరుని మృతదేహం రైల్వే ట్రాక్‌పై పోలీసుల‌కు ల‌భ్య‌మ‌య్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  జితేంద్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  అతని సోదరుడు చోటు మృతదేహం రైల్వే ట్రాక్‌పై గుర్తించిన‌ పోలీసులు ఆ మృత దేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

త‌రువాత కుటుంబ సభ్యుల‌ను పోలీసులు విచారించారు.  వారిద్దరి మరణానికి కారణం తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు.  జితేంద్ర రాత్రి ఇంటికి వచ్చి, ఆహారం పెట్టాల‌ని అడిగాడు, తల్లి అతనికి రొట్టె  అందించింది. దీనిని చూడ‌గానే జితేంద్ర త‌ల్లితో రొట్టె న‌చ్చ‌లేదంటూ గొడ‌వ ప‌డ్డాడు. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న చోటు.. త‌న అన్న‌ జితేంద్ర తలపై ఇటుకతో బ‌లంగా మోదాడు. దీంతో జితేంద్ర అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. దీనిని గ‌మ‌నించిన చోటు రైలుకు ఎదురుగా వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ చోటు త‌న‌ అన్నయ్యను చంపి, త‌రువాత‌ ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింద‌న్నారు.