కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేయాలంటూ వాట్సాప్ సందేశాలు రావడం వెనుకున్న అసలు నిజాన్ని పోలీసులు ఛేదించారు. దీని వెనుకున్నది ఇద్దరు తాగుబోతుల పిచ్చి వాగుడు అని తేల్చారు.

ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌ జిల్లా దర్చులా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం పీకలదాకా తాగారు.. ఏం తోచక పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ సోమవారం తమ ప్రాంత పర్యటనకు రానున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వైపు మళ్లింది. దీంతో ఆమెను చంపేయాలని ప్లాన్ గీశారు.. అక్కడితో ఆగకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేసుకున్నారు.

ఈ క్రమంలో వారిలో ఒకరు ‘‘సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను.. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు’’ అని ఛాట్ చేసుకున్నారు. ఈ మెసేజ్‌లు ఆ నోటా ఈ నోటా బయటి గ్రూపులకు చేరాయి. ఎవరో ఆ ఛాటింగ్‌ను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు రంగంలోకి దిగి.. ఇద్దరు తాగుబోతులను అదుపులోకి తీసుకున్నారు.

వీరు తాగిన మైకంలో నోటికి వచ్చింది మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే వీరిద్దరిపై గతంలో ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా..? లేదా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు.