పూర్వం కనీసం ఒకరి ముఖం మరొకరు కూడా చూసుకోకుండా పెళ్లిళ్లు  చేసుకునేవారు. తర్వాత తర్వాత రోజులు మారాయి. ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ 4జీ కాలంలో అది కూడా దాటిపోయింది. పెళ్లికి ముందే కలిసి జీవిస్తున్నారు. అదే సహజీవనం. నచ్చితే తర్వాత పెళ్లి చేసుకుంటారు. తర్వాత నచ్చకుంటే ఎవరిదారిన వాళ్లు విడిపోతారు. అయితే.. ఈ సహజీవనం విధానం పెద్దలకు నచ్చని విషయమే. తమ పిల్లలు అలా చేస్తామంటే కచ్చితంగా వద్దని చెబుతుంటారు. అయితే.. ఈ సహజీవనం విధానంపై తాజాగా ఓ కోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది.

సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మేజర్ అయిన ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించడమనేది వారి హక్కని పేర్కొంది. వారి స్వేచ్ఛను హరించడానికి వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ హక్కు లేదని పేర్కొంది. వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని ఆదేశించింది. 

జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాశ్ పడియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. ఫరూఖాబాద్‌కు చెందిన కామినీ దేవి, అజయ్ కుమార్ జంట వేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. తాము ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకుంటున్నామని కలిసి జీవిస్తున్నామని పిటిషన్‌లో కామిని పేర్కొంది. అయితే తమను తన తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారని, వేరే అబ్బాయితో పెళ్లికి బలవంతం చేస్తున్నారంటూ కామినీ దేవి తన పిటిషన్‌లో తెలిపింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగం ప్రసాధించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది.