భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ కి ఉండే బ్లూ టిక్ ని ట్విట్టర్ తొలిగించిందని భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ట్విట్టర్ లో బ్లూ టిక్ అనేది వెరిఫైడ్ అకౌంట్ ని సూచిస్తుంది. సెలబ్రిటీ, వీఐపీ అకౌంట్లను అఫిషియల్ అంటూ తేలికగా గుర్తించడం సామాన్యుడికి సులభమవుతుంది. 

తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అకౌంట్ కి ఉండే బ్లూ టిక్ ని ట్విట్టర్ తొలిగించింది. దీనిపై పలువురు మండిపడుతున్నారు. వెంకయ్య నాయుడు పర్సనల్ హ్యాండిల్ బ్లూ టిక్ ని మాత్రమే తొలిగించింది. అధికారిక ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ హ్యాండిల్ కి మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జి అలానే ఉంది. 

అయితే వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ చాలా కాలంగా ఇనాక్టివ్ గా ఉంది. 6 నెలలకు మించి ఇనాక్టివ్ గా ఉన్న అకౌంట్ల నుంచి వెరిఫైడ్ టాగ్ తీసేస్తామని ట్విట్టర్ తమ రూల్స్ లో పేర్కొంది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ చాలా మంది సెలెబ్రిటీల అకౌంట్లు సంవత్సరం నుండి ఇనాక్టివ్ గా ఉన్నప్పటికీ... వాటికి బ్లూ టిక్ ఎందుకు తీసెయ్యలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

ఏది ఏమైనా ట్విట్టర్ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందే అని భారత ప్రభుత్వం హుకుం జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిమీద ట్విట్టర్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.