Asianet News TeluguAsianet News Telugu

ఏజెంట్‌ను నియమించడానికి భారత ప్రభుత్వం సంప్రదించలేదు: పార్లమెంటరీ ప్యానెల్‌కి తేల్చిచెప్పిన ట్విట్టర్

వినియోగదారుల డేటాను పర్యవేక్షించేందుకు భారత ప్రభుత్వం తన సొంత ఏజెంట్‌ను నియమించుకుందని ఆరోపిస్తూ మాజీ ట్విట్టర్ ఉద్యోగి సంచలనం సృష్టించారు. దీనికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరైన ట్విట్టర్ ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు. 
 

twitter denies allegations that govt of india approached for appointment of agent parliamentary panel on user data hacking
Author
First Published Aug 26, 2022, 9:17 PM IST

జట్కో అనే మాజీ ఉద్యోగి కారణంగా చోటు చేసుకున్న యూజర్ డేటా గోప్యత, ఉల్లంఘనలు, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై పార్లమెంటరీ ప్యానెల్ శుక్రవారం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ప్రశ్నించింది. కంపెనీ అధికారుల బృందం.. ఈరోజు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరైంది . ఈ సందర్భంగా తాము ఖచ్చితమైన డేటా భద్రతా నిబంధనలను అనుసరిస్తున్నామని, చాలా మంది ఉద్యోగులకు యూజర్ డేటాను యాక్సెస్ చేసే అధికారం లేదని చెప్పారు. అంతేకాకుండా తమ ప్రధాన కార్యాలయంలోనే వినియోగదారుల డేటాను యాక్సెస్ చేసే వీలుందని.. అది కూడా పూర్తిగా సాంకేతిక ప్రయోజనాల కోసమేనని ప్యానెల్‌కు కంపెనీ అధికారులు తెలిపారు. 

ఇకపోతే.. తమ ఏజెంట్లలో ఒకరిని కంపెనీలో నియమించాలని భారత ప్రభుత్వం ట్విట్టర్‌ని ఒత్తి చేసిందన్న జాట్కో ఆరోపణలపై ప్రశ్నలకు సమాధానంగా... భారత ప్రభుత్వం అలాంటి డిమాండ్ ఏం చేయలేదని ట్విట్టర్ స్పష్టం చేసింది. అలాగే ఏదైనా డేటా లీకేజీ అయినట్లయితే సభ్యులు.. ట్విట్టర్ బృందం నుంచి తెలుసుకోవచ్చని చెప్పినట్లు కమిటీలో వున్న కొందరు జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి తెలిపాయి. అలాగే తమ ద్వారా ఎటువంటి డేటా లీక్ జరగలేదని ట్విట్టర్ బృందం.. కమిటీ సభ్యులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. 

యూజర్ల డేటా ప్రత్యేకంగా ఎవరికైనా లేదా వారిలో కొందరికైనా అందుబాటులో వుందా అని సభ్యులు ట్విట్టర్ బృందాన్ని ప్రశ్నించారు. దీనికి.. భారత్‌లోని ఏ ఉద్యోగికి యూజర్ డేటా యాక్సెస్ లేదని ట్విట్టర్ తెలియజేసింది. అలాగే ఏదైనా డేటా ఉల్లంఘనను నియంత్రించడానికి మీ వద్ద ఏదైనా మెకానిజం వుందా అని సభ్యులు ట్విట్టర్‌ని ప్రశ్నించారు. దానికి ట్విట్టర్ ప్రతినిధులు డేటా ఉల్లంఘన లేదని తెలిపారు. 

ఇక.. వినియోగదారులు ట్విట్టర్ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను గోప్యంగా సంప్రదించిన సందర్భాలు వున్నాయా అని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అలాగే భారత్‌లో ట్విట్టర్‌లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు..? డేటా నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐటీ విభాగంలో, సెక్యూరిటీ టీమ్‌లో ఎంతమంది వున్నారు అని ప్యానెల్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నల్లో కొన్నింటికి ట్విట్టర్ ప్రతినిధులు సంతృప్తికర సమాధానం ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని వారు తెలిపారు. 

50 నిమిషాల పాటు సాగిన చర్చలలో ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో అసమర్ధత కారణంగా .. ఒక వారంలోగా వ్రాతపూర్వకంగా సమాధానాలను పంపాలని ప్యానెల్ ఆదేశించినట్లుగా ఏఎన్ఐ తెలిపింది. ట్విట్టర్ అధికారులు షగుఫ్తా కమ్రాన్ (ట్విట్టర్ డైరెక్టర్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్‌) తో పాటు ఇతర కార్యదర్శులు కమిటీ ముందు హాజరయ్యారు. శశిథరూర్ ఛైర్మన్‌గా వున్న ఈ పార్లమెంటరీ ప్యానెల్‌లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఐఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌లు సభ్యులుగా వున్నారు. 

ఇదే సమయంలో విజిల్‌బ్లోయర్ జాట్కో చేసిన కొన్ని ఆరోపణలపై, మీడియాలో చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాలపైనా కమిటీ సభ్యులు వివరణ కోరారు. మీడియా నివేదికల ప్రకారం కంపెనీకి చెందిన 5,00,00 డేటా సెంటర్ సర్వర్‌లలో సగం కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో నడుస్తున్నాయని, నిల్వ చేసిన డేటా కోసం ఎన్‌క్రిప్షన్ వంటి ప్రాథమిక భద్రతా చర్యలకు మద్ధతు ఇవ్వని లేదా వాటి విక్రేతల నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందలేదని జాట్కో ఆరోపించాడు.

మీడియా నివేదికల ప్రకారం.. జాట్కో కూడా భారత ప్రభుత్వం ట్విట్టర్‌ను తన ఏజెంట్లలో ఒకరిని నియమించుకోమని బలవంతం చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా మీడియా నివేదికలను తాము కూడా చదివామని, అయితే దీని గురించి పంచుకోవడానికి ఎలాంటి వివరాలు లేవని ప్యానెల్‌కు రాసిన ప్రత్యుత్తరంలో ట్విట్టర్ తెలిపిందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఏ ఏజెంట్‌ను నియమించుకోవడానికి భారత ప్రభుత్వం తమను ఎప్పుడూ సంప్రదించలేదని వారు చెబుతున్నారు. 

ఇక యూజర్స్ తమ ఖాతాలను రద్దు చేసిన తర్వాత.. వారి డేటాను ట్విట్టర్ విశ్వసనీయంగా తొలగించడం లేదని ఫిర్యాదు అందింది. కొన్ని సందర్భాల్లో కంపెనీ సమాచారాన్ని కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios