చెన్నై: తిరుచ్చి లలితా జ్యువెలరీస్ నగల చోరీ కేసు మరో మలుపు తీసుకుంది. నగలు చోరీ చేసిన దొంగల ముఠా నేత రూ. 10 కోట్ల విలువైన నగలు, సినీ నటితో శ్రీలంకకు పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. తిరుచ్చి సత్రం బస్టాండులోని ప్రముఖ నగల దుకాణం లలితా జ్యువెలరీస్ లో ఈ నెల 2వ తేదీన రూ. 13 కోట్ల విలువైన నగల చోరీ జరిగింది. 

ఆ చోరీకి సంబంధించి తిరువారూరు మండపురానికి చెందిన మణికంఠన్ నాలుగు కిలోల బంగారు నగలతో పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో సురేష్, అతని మామ పేరుమోసిన దొంగ అని, తిరువరూరు మురగన్ తో కలిసి రూ. 13 కోట్ల విలువ చేసే నగలను దోచుకున్నాడని మణికంఠన్ చెప్పాడు. 

కాగా, తిరువరూరు మురగన్ రూ. 10 కోట్ల విలువైన నగలతో శ్రీలంకకు పారిపోయినట్లు తెలుస్తోంది. నగలతో పాటు సినీ నటిని వెంట తీసుకుని వెళ్లినట్లు పోలీసు విచారణలో తేలింది. అతనికి చెన్నై ఈసీఆర్ లో లగ్జరీ భంగలా, ఇతర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో మురగన్ బ్యాంకుల్లో, నగల దుకాణాల్లో, ఇళ్లలో దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో చేతివాటాన్ని ప్రదర్శించినట్లు భావిస్తున్నారు. మురగన్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడని కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారమని, మరో ఐదుగురిని త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్ అమల్ రాజ్ తెలిపారు. 

మురుగన్ పై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 150కి పైగా దోపిడీ కేసులో పెండింగులో ఉన్నాయి. 45 ఏళ్ల మురుగన్ చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో గల తిరువరూరుకు చెందినవాడు. లూటీల్లో మురుగన్ ప్రత్యేకంగా వ్యవహరిస్తాడు. ఎప్పుడు కూడా లాడ్జీల్లో ఉండడు. కారులోనే అతనికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. తన ఇంట్లో కూడా ఉండడు.

సమాచార వినిమియం కోసం మురుగన్, అతని ముఠా వాకీ టాకీలను వాడుతారు. ఇంట్లో మురుగన్ ను అరెస్టు చేయడానికి తిరువరూరు పోలీసులు 50 సార్లకు పైగా ప్రయత్నించారు. సినిమాలపై అతనికి అమితమైన ఆసక్తి, 2011లో అతను ఓ సినిమా కూడా తీయాలని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరిస్ మనీ హీస్ట్ ను చూసి మురుగన్ దోపిడీకి స్కెచ్ వేసినట్లు భావిస్తున్నారు.