అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి వివాదం కేసులో విచారణ అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు గాను సుప్రీంకోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల బెంచ్ నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. విచారణకు ముందే ధర్మాసనం నుంచి ఆయన తప్పుకోవడంతో కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు మిగిలిన న్యాయమూర్తులు ప్రకటించారు.

జస్టిస్ లలిత్ స్థానంలో మరో జడ్జి వచ్చే వరకూ కేసు విచారణలో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు జనవరి 4న స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అందుకు గాను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూవీ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉంటారు. అయోధ్య వివాదంపై మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి.