మరికొద్ది గంటల్లో మూడు ముళ్లు పడి ఓ ఇంటికి కోడలికి వెళ్లాల్సిన పెళ్లి కూతురు ప్రియుడితో జంప్ అయిన సంఘటనలు మనం ఎక్కువగా సినిమాల్లోనో, సీరియళ్లలోనో చూస్తుంటాం. అయితే రీయల్ లైఫ్‌లో ఓ యువతి ఈ ఘనకార్యం చేసింది.

కానీ పరువు పోకూడదని వరుడికి ఆమె చెల్లెలినిచ్చి పెళ్లి చేసినా పెద్దలకు షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని కలహండీ జిల్లా మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.

పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఇరు పక్షాల వాళ్లు. తీరా ముహూర్త సమయం రానే వచ్చింది. మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా.. వధువు తాను ప్రేమించిన వ్యక్తితో జంప్ అయ్యింది.

దీంతో తమ పరువు గంగలో కలిసిపోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని అబ్బాయి తరుపు వాళ్లు పట్టుబట్టారు.  దీంతో గత్యంతరం లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు.

గండం గట్టెక్కి అమ్మాయిని ఆనందంగా తన ఇంటికి తీసుకెళ్లారు వరుడి తరుపు వారు. అయితే పెళ్లి కుమార్తె వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని, చట్టారీత్యా నేరమంటూ షాకిచ్చారు అధికారులు.

బాలికకు 18 ఏళ్లు వచ్చేదాకా అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో ఇరు పక్షాల వారు అంగీకరించారు. మైనర్‌ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు అధికారులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.