కేరళలోని కోజికోడ్ విమాన ప్రమాదానికి సంబంధించి బాధితుల గాథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కవలలు మృత్యుంజయులుగా నిలిచి ఆశ్చర్యపరిచారు.

వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లో నివసిస్తున్న వీరి కుటుంబంలో తండ్రి అక్కడే ఉండిపోయాడు. తల్లి, నలుగురు బిడ్డలతో కలిసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు.

Also Read:కేరళ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ లభ్యం

అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడ్డారు. వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అయితే ఈ కవలల తల్లి ఎలా ఉన్నారనే దానిపై మాత్రం వివరాలు తెలియాల్సి వుంది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన వీరిని స్థానికులు, రక్షణ సిబ్బంది ఫిరోక్ చుంగమ్‌లోని రెడ్ క్రెసెంట్‌ ఆసుపత్రికి తరలించారు.

Also Read:కేరళ విమాన ప్రమాదం : ఇంతకీ అసలేం జరిగింది?

దీంతో గుర్తు తెలియని కవలలు పేరుతో జిల్లా అధికారులు వీరిని ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తద్వారా వీరిని మలప్పురం వాసులుగా గుర్తించారు. ఈ కవలల సమీప బంధువు, మేనమామ రావడంతో శుక్రవారం చిన్నారులను డిశ్చార్జ్ చేశారు.