లక్నో: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్‌లో ఈ నెల 12వ తేదీన కిడ్నాప్‌కు గురైన కవల సోదరులను కిడ్నాపర్లు దారుణంగా హత్య చేశారు. మృతదేహాలను ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని యమున నదిలో వేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ నూనె వ్యాపారం చేసే బ్రిజేష్‌ రావత్‌కు  ఆరేళ్ల కవలలు ఉన్నారు.వారిలో శ్రేయాన్ష్ రావత్, ప్రియాన్ష్ రావత్‌లు ఉన్నారు. వీరిద్దరూ కూడ సద్గురు  పబ్లిక్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నారు.  స్కూల్‌ నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు గన్‌లతో బెదిరించి పిల్లలను స్కూల్‌ నుండి కిడ్నాప్‌ చేశారు.

ఈ నెల 19వ తేదీన కిడ్నాపర్లకు బ్రిజేష్‌ రావత్ రూ.  20 లక్షలను చెల్లించారు. అయితే పిల్లలు మాత్రం తిరిగి రాలేదు. ఈ నెల 21వ తేదీన కవలలను కిడ్నాపర్లు హత్య చేశారు.మృతదేహాలకు రాళ్లు కట్టి మరీ యమునా నదిలో పారేశారు.  

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లా బజేరు గ్రామంలో ఆదివారం రాత్రి మృతదేహాలు  తేలుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.ఈ హత్యలకు సంబంధించి  చిన్నారుల ట్యూషన్ టీచర్‌తో పాటు ఇద్దరు ఇంజనీరింగ్ విధ్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.