జాతకాల పిచ్చి పీక్స్ కు చేరితే ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈ జాతకాలకోసం వింతవింతగా ప్రవర్తిస్తుంటారు. అలాగే చేసిందో యువతి.. తన జాతకంలోని దోషాన్ని పోగొట్టుకోవడానికి 13యేళ్ల బాలుడిని వివాహమాడి, వారం రోజుల తరువాత వితంతువుగా మారింది. 

వివరాల్లోకి వెడితే.. జాతకంలో మాంగల్య దోషం ఉందని 13 ఏళ్ల వయసున్న స్టూడెంట్ ను వివాహం చేసుకుంది ఓ టీచర్. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో‌ వెలుగు చూసింది. భక్తి బావా కేల్ ప్రాంతంలో ట్యూషన్ టీచర్ గా పని చేస్తున్న ఓ యువతికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వివాహం కుదరకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పూజారి ని సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

 దీంతో సంబంధిత యువతి పుట్టిన జాతకం ప్రకారం ఆమెకు మాంగల్య దోషం ఉందని పూజారి పేర్కొన్నాడు. దీని నివారణకు ఆమెకు మైనర్ బాలుడితో ముందుగా పెళ్ళి చేయాలని సూచించాడు. ఈ క్రమంలో మహిళ తన వద్దకు వచ్చే విద్యార్థుల్లోని 13 ఏళ్ల బాలుడు ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. ట్యూషన్ క్లాసుల కోసం బాలుడు తన వద్దే వారంపాటు ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఒప్పించింది.  

ఏడు రోజులపాటు విద్యార్థిని టీచర్ తన ఇంట్లోనే ఉంచుకుని పెళ్లి వేడుకలు నిర్వహించారు. అనంతరం తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపించింది.

వారం తర్వాత ఇంటికొచ్చిన బాలుడు తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బస్తీ బావా కేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకును నిర్బంధించి బలవంతంగా హల్దీ వేడుక, మొదటి రాత్రి వంటి ఆచారాలు నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే మహిళ ఒత్తిడి మేరకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు ఉపసంహరించుకున్నారు. 

అయితే ఈ విషయం చివరికి సీనియర్ పోలీస్ అధికారుల వరకు చేరడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన డి.ఎస్.పి గుర్మీత్ సింగ్ పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. బాలుడు మైనర్ కావడంతో లోతుగా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు సదరు టీచర్ పై ఆమె తల్లిదండ్రుల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.