శశికళ చెన్నై రాకముందే తమిళ రాజకీయాలు హీటెక్కాయి. అక్రమాస్తుల కేసులో 2017లో బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలుకెళ్లారు శశికళ. అయితే కొన్ని రోజుల క్రితం ఆమెను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు అధికారులు.

కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్లీ నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఇవాళ ఆసుపత్రి నుంచి శశికళను డిశ్చార్జ్ చేశారు.

అయితే అన్నాడీఎంకే బహిష్కృత నేతగా వున్న శశికళ.. డిశ్చార్జ్ అయ్యే సమయంలో కారుపై ఏఐడీఎంకే జెండా ఉండటం కలకలం రేపుతోంది. పార్టీ జెండా వాడటంపై మంత్రి జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఇప్పటికే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. డిశ్చార్జ్ రోజే అన్నాడీఎంకే పార్టీ జెండాను వాడటం సంచలనం కలిగించింది. 2016 వరకు పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు శశికళ.

Also Read:ఆసుపత్రి నుండి శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే చిన్నమ్మ

అయితే అనంతరం జరిగిన పరిణామాలతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం సంచలనం కలిగిస్తోంది.

అయితే మంత్రులకు కౌంటరిచ్చారు టీటీవీ దినకరన్. శశికళ ఇప్పటికీ ఏఐడీఎంకే జనరల్ సెక్రటరీనే అని ఆయన స్పష్టం చేశారు. శశికళ వారం రోజులు హోం క్వారంటైన్‌లోనే ఉంటారని దినకరన్ వెల్లడించారు.