Asianet News TeluguAsianet News Telugu

2024లో ప్రధాని అభ్యర్థి ఎవరు? శరద్ పవార్‌తో భేటీ అనంతరం నితీష్ కుమార్ సమాధానం ఇదే!

ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తీసుకురావడానికి నితీష్ కుమార్ అపోజిషన్ మిషన్‌ చేపట్టారు. ఢిల్లీ వెళ్లి వరుసగా ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు. తాజాగా, శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష శిబిరం నుంచి ప్రధాని అభ్యర్థిగా తాను ఉండాలని భావించడం లేదని, తమ నేతను అందరం కలిసి ఎంపిక చేసుకుంటామని తెలిపారు.
 

trying to unite opposition.. I will not be the leader says jdu leader cm nitish kumar
Author
First Published Sep 8, 2022, 1:35 AM IST

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఇది వరకు కనీసం రెండు మూడు సార్లు ఐక్య కూటమి కోసం ప్రయత్నించి మిన్నకుండిపోయాయి. ఇప్పుడు బిహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. తాజాగా, ఆయన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. అనంతరం, 2024 ప్రధాని అభ్యర్థి గురించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ ఏకతాటి మీదికి తేవడానికి నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ, జనతా దల్ సెక్యూలర్ నేత హెచ్‌డీ కుమారస్వామి, సీపీఎం జనరల్ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ రాజా, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ఓం ప్రకాశ్ చౌతలా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఆయన సీపీఐఎంఎల్ జెనరల్ సెక్రెటరీ దీపాంకర్ భట్టాచర్యనూ కలిశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము థర్డ్ ఫ్రంట్‌ను కాదు.. మెయిన్ ఫ్రంట్‌నే నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. తాను ప్రతిపక్షాలను ఏకం చేయాలని అనుకుంటున్నానని అన్నారు. కానీ, దానికి తాను నాయకత్వం వహించబోనని వివరించారు. దేశాన్ని మొత్తం తన గుప్పిట్లోకి తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఈ ఎన్నికలను అందరు కలిసి పోరాడితే.. సినిమా వేరుగా ఉంటుందని తెలిపారు.

2024లో ప్రధాని మోడీకి పోటీగా ప్రతిపక్ష శిబిరం నుంచి ఎవరు నిలబడతారని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా ‘వారు చేస్తున్నవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. వారు కేవలం ప్రచారం మాత్రమే చేశారు. పేర్లు మార్చారు. పని విషయానికి వస్తే పెద్దగా చేసిందేమీ లేదు’ అని జవాబిచ్చారు. తనకు వ్యక్తిగత కాంక్ష ఏమీ లేదని, ప్రతిపక్ష నేతలంతా కలుసుకోవాలని కోరుకుంటున్నానని, అందరం కలిసి తమ నేతను ఎంపిక చేసుకుంటామని వివరించారు.

ప్రతిపక్ష శిబిరానికి తాను నాయకత్వం వహించాలని, లేదా 2024 ఎన్నికల్లో పీఎం అభ్యర్థిగా తాను నిలబడాలని నితీష్ కుమార్ భావించడం లేదని తెలుస్తున్నది. అయితే, ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్ష నేతలంతా కలిసి ఎంపిక చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios