దొంగతనానికి చివరికి స్మశానాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. మృతదేహాల మీద నగలు దొంగిలించడం ఇప్పటికే వింటున్నాం. ఇప్పుడు కాల్చేసిన శవం బూడిదలో కూడా బంగారం కోసం వెతికే దుస్థితికి జనాలు దిగజారుతున్నారు.

మహారాష్ట్ర, ఔరంగాబాద్ లో గర్భిణీని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం వెతికి నలుగురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. చివరికి జైలు పాలయ్యారు. షోలాపూర్ జిల్లా బర్లోని గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే...  షోలాపూర్ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్ హస్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతి అనే నలుగురు ఉద్యోగాలు పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన ఓ గర్భిణీ మరణించింది. ఆమె అంత్యక్రియలు స్థానిక స్మశాన వాటికలో నిర్వహించారు. అయితే గర్బిణీ మృతదేహంపై బంగారు నగలు ఉంచే అంత్యక్రియలు చేస్తారని వారికి తెలిసింది. 

దీంతో గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో కరిగిన బంగారాన్ని దొంగిలించాలని వారు ప్లాన్ చేసుకున్నారు. బుధవారం అంత్యక్రియలు అయిపోయిన తర్వా బూడిదలో నగల అవశేషాల కోసం వెతుకుతున్నారు. 

ఇది గ్రామస్తుల కంట పడింది. దీంతో గ్రామస్తులు ఆ నలుగురినీ పట్టుకుని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. ఓ గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.