ఢిల్లీ అసెంబ్లీలో నేడు ఆప్ బలపరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ బల పరీక్ష కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలన్నీ సాధ్యం కాలేదని  

న్యూఢిల్లీ: ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలాన్ని చూపెట్టుకోనుంది. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని నిరూపించుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ బల పరీక్షకు పూనుకున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయినట్టు నిరూపించాలని అనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలో ఇప్పటికే ఆయన బలపరీక్ష కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై చర్చకు ఆహ్వానిస్తూ స్పీకర్.. సీఎం కేజ్రీవాల్ తీర్మానాన్ని ఆమోదించారు. ఢిల్లీ ప్రత్యేక సమావేశాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆప్ బలపరీక్షను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఈ ట్రస్ట్ వోట్‌ను కూడా ఆప్ దుర్వినియోగం చేస్తున్నదని, రాజకీయాలకు వాడుకుంటున్నదని విమర్శించింది. ఈ రోజు సమావేశాలు ఆందోళనలతోనే మొదలయ్యాయి. ఆప్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇతర సమస్యలపై చర్చ చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారు సభలో గందరగోళం సృష్టించారు. దీని నివారణకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆప్ ప్రభుత్వం బయటకు పంపింది.

తమ పార్టీ ఎమ్మెల్యేలను లోబరుచుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేసిందని అరవింద్ కే్జ్రీవాల్ అన్నారు. ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇవ్వజూపిందని వివరించారు. బీజేపీ పార్టీలో చేరితే రూ. 20 కోట్లు ఇస్తామని ఆప్ ఎమ్మెల్యేలకు ఆశచూపిందని పేర్కొన్నారు. ఈ విషయాలు తనకు స్వయంగా ఎమ్మెల్యేలు చెప్పారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే, తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీపరులని, అందుకే ఆ పార్టీకి అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని నిరూపించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

అయితే, అంత మొత్తంలో డబ్బులు వెచ్చించడానికి బీజేపీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ డబ్బును ప్రజల నుంచే లాక్కుంటున్నదని తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి అక్రమాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నదని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ దేశాల్లో వీటి ధర దిగి వస్తుంటే భారత్‌లో మాత్రం పెరుగుతున్నదని తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతున్నదని ప్రశ్నిస్తూ.. ఆ పెంచిన డబ్బుతోనే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నదని ఆరోపించారు.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆప్ పార్టీకే 62 మంది సభ్యుల బలం ఉన్నది. బీజేపీకి 8 మంది శాసన సభ్యులు ఉన్నారు. మెజార్టీ మార్క్ కోసం బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు.