అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ అహ్మదాబాద్ కి చేరుకున్నారు. తాను భారత్ వస్తున్న విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా కూడా తెలియజేశారు. అది కూడా హిందీలో ట్వీట్ చేశారు. అగ్రదేశ అధిపతి ట్రంప్ భారత్ రాక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర  చర్చనీయాంశమైంది.

తొలిసారి డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు వస్తుండటంతో... వారికి సంబంధించిన ప్రతివార్త వైరల్ అవుతోంది. ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు కూడా తీవ్ర ఆసక్తి కనపరుస్తున్నారు. కాగా... తాజాగా ట్రంప్ , ఆయన సతీమణి బస చేసే హోటల్ గురించి, దానికయ్యే ఖర్చు గురించి  ఓ వార్త వెలువడగా... ఆ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read ట్రంప్ కి ఓన్లీ వెజ్! అల్పాహారం లో ఖమన్... ఈ వంటకం ప్రత్యేకతేమిటి?.

 ట్రంప్‌ దంపతులు అహ్మదాబాద్‌, ఆగ్రా పర్యటనల అనంతరం ఢిల్లీకి చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. వీరికోసం ఢిల్లీ ఐటీసీ మౌర్యా హోటల్‌లోని గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను కేంద్ర ప్రభుత్వం బుక్‌చేసింది. ఒక రాత్రికి ఆ సూట్‌లో ఉండటానికి అయ్యే ఖర్చు అక్షరాల 8 లక్షల రూపాయలు.

అంతే... ఈ న్యూస్ నెట్టింట వైరల్ అయినదగ్గర నుంచి నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కేవలం హోటల్ గదికే అంత ఖర్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు కదా... ఆ మాత్రం ఖర్చు ఉంటుందిలే అని మరికొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. 

అయితే.. అంత ఖర్చు పెట్టడానికి ఆ హోటల్ లో ఏముంది అనే డౌట్ రావచ్చు. దానిపై కూడా నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తుండటం విశేషం. సిల్క్‌ ప్యానెల్డ్‌ గోడలు, వుడెన్‌ ఫ్లోరింగ్‌, అదిరిపోయే కళాకృతులు, సౌకర్యవంతమైన లివింగ్‌ రూం, ప్రత్యేకమైన డైనింగ్‌ గది, విలాసవంతమైన రెస్ట్‌రూం, మినీ స్పా, పర్శనల్‌ జిమ్‌ ఉన్నాయి. 

అంతేకాకుండా అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన 55 అంగుళాల హై డెఫినిషన్‌ టీవీ, ఐపాడ్‌ డాకింగ్‌ స్టేషన్‌, ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రోబయోలాజికల్‌ లాబొరేటరీ, బయట వైపు గాలి విషతుల్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్‌ క్లింటన్, జార్జ్‌ బుష్‌లు బస చేశారు.